రాజ భక్తి సరే..అభ్యంతరాల మాటేమిటి..?

మనం ఎన్ని చెప్పినా వినిపించుకునే పాలకులు లేరు. ఎందుకంటే అయిదేళ్ల పాటు మనం వారికి అధికారాన్ని రాసి ఇచ్చేశాం కదా. అందుకని వారు చెప్పినట్లు చచ్చినట్లు వినాల్సిందే. లక్షలాది కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయని ప్రభుత్వం పోలీసులను మాత్రం అడగకుండానే నింపుతోంది. ఎందుకంటే ప్రజలు, విపక్షాలు ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా లేదా ఆందోళనలు చేపడితే అరెస్టులు చేయాలి కదా అందుకని. మొత్తం మీద స్వాముల కాలం నడుస్తున్నది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో. ఒకరు విశాఖ పీఠాధిపతి అయితే ఇంకొకరు శంషాబాద్ పరివారంలో ఉన్న స్వామిజి. మొదటి నుంచి భక్తి భావం కలిగిన మన రాష్ట్ర సీఎంకు వారంటే ఎనలేని గౌరవం.

ఇంకేం తాను ఆరాధించే శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయాన్ని తిరుమలకు ధీటుగా తీర్చి దిద్దాలని తలపెట్టారు. ఆమేరకు నిధులు మంజూరు చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఇక ఈ ఆలయ పేరు యాదగిరిగుట్టగా ఉండగా దానిని చిన్నజీయర్ స్వామి వారు యాదాద్రిగా మార్పు చేశారు. దీనిపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. దానిని సీఎం పట్టించుకోలేదు. స్వామి వారికే పూర్తిగా ఆలయ పునర్ నిర్మాణం పనులు అప్పగించారు కేసీఆర్. దీనిని ప్రముఖ కళానిపుణుడు ఆనంద సాయి, ఇతర శిల్ప కళా నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో అనుకోకుండా శిల్పులకు , ఆలయ అధికారులకు రాజ భక్తి ఎక్కువైనట్లు ఉన్నదేమో..ఏకంగా మన రాజా వారి బొమ్మ, కారు గుర్తు కూడా శిలలపై చెక్కారు.

దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ధార్మిక సంఘాలు , విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ అంతటా ఆందోళనలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను మోహరించారు. కాంగ్రెస్,, బీజేపీ , భజరంగ్ దళ్ కు చెందిన వారంతా ఆందోళనలు చేపట్టారు. దీనిపై ఆలయ బాద్యులు స్పందించారు. కేసీఆర్ ను రాజుగా భావించి శిల్పులు చెక్కారని, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని యాడా వైస్ చైర్మన్ కిషన్ రావ్ వెల్లడించారు. ఆయన ఆనంద సాయి తో కలిసి మాట్లాడారు. సీఎంను దేవుడిగా భావించి చేసారని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. చరిత్రను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని, ఒకవేళ అభ్యంతరకరమని భావిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మొత్తం మీద ఆ మాత్రం తెలియకుండా ఏం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!