భవిష్యత్తు ఆవసరం.. గతం కాదనలేం..స్పష్టం చేసిన ధర్మాసనం..!

గత కొంత కాలంగా రాష్ట్ర  సర్కారుకు హైకోర్టు లో ప్రతిదీ చుక్కెదురవుతోంది. తాజాగా ఎర్రమంజిల్ ను కూల్చాలన్న ప్రతిపాదనను విరమించు కోవాలని ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. రూల్స్ ను, ఆదేశాలను ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదంటూ నిలదీసింది. భవిష్యత్తు ముఖ్యమే కాదనలేం, కానీ గతం కూడా అవసరమే ఎందుకంటె గతం అన్నది లేకపోతే ఫ్యూచర్ మరింత అంధకారమవుతుంది. నరుక్కుంటూ పోతే చెట్లు, కూల్చుకుంటూ పోతే కట్టడాలు మిగలవు. ఆనవాళ్లు మాత్రమే మిగిలి పోతాయి. ఇందు కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ మంది పడింది. ఎర్రమంజిల్​లోని భవనాలను కూల్చి కొత్త గా అసెంబ్లీని కట్టాలనుకున్న ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేబినెట్​ నిర్ణయం చట్ట పరిధిలో లేదని, ప్రత్యక్షంగా చేయలేని దాన్ని పరోక్షంగా చేసే ప్రయత్నం ఇందులో కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

అసెంబ్లీ కోసం హెరిటేజ్‌ భవనాల్ని కూల్చేస్తే ప్రజల చిరకాల చారిత్రక సంస్కృతులు భూస్థాపితం అవుతాయని పేర్కొంది. కీలకమైన రూల్స్​ను, ప్రొసీజర్​ను, హైకోర్టు ఆదేశాలను సర్కారు పట్టించు కోలేదు. అందువల్ల ఈ నిర్ణయం ఏకపక్షం..అందుకే దాన్ని పక్కన బెడుతున్నామని స్పష్టం చేసింది. వారసత్వ భవనాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే జోనల్‌ రెగ్యులే షన్‌-1981లోని 13(2)  నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందని, ఎర్రమంజిల్​ విషయంలో ఆ నిబంధనను అమలు చేయకుండా జూన్‌ 18న రాష్ట్ర కేబినెట్‌  నిర్ణయం తీసుకుందని మండి పడింది. విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆస్కారం తక్కువగా ఉన్నప్పటికీ చట్టాలకు లోబడి కేబినెట్​ నిర్ణయం లేనందున జోక్యం చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. ఏదైనా నగర గుర్తింపు, చరిత్ర, గతం గురించి చెప్పేవి వారసత్వ భవనాలేనని, ఈ విషయాన్ని పట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేయగా వీటన్నింటినీ కలిపి హైకోర్టు ఉమ్మడిగా విచారించింది.

చీఫ్​ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జడ్జి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ 111 పేజీల తీర్పు వెలువరించింది. హెరిటేజ్​ భవనాల విషయంలో 2016 ఏప్రిల్‌ 18న తాము ఇచ్చిన మార్గ దర్శకాలను కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్‌లోని భవనం 150 ఏండ్ల నాటిదని, ఈ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాల సముదాయాన్ని నిర్మించాలను కోవడం కుదరదని హైకోర్టు పేర్కొంది. వారసత్వ, సాంస్కృతిక సంపదను హెచ్ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ రూల్స్‌లో చేర్చాక, వాటిని సవరించాలంటే చట్ట ప్రకారం చేయాల్సిందే. పాత చట్టం కింద  ఒక నిబంధన చేరాక ఆ చట్టం రద్దయినా ఆ నిబంధన కొనసాగుతుంది. మాస్టర్‌ ప్లాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రెగ్యులేషన్‌ 13ను మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. హెరిటేజ్‌ కన్సర్వేటివ్‌ కమిటీ ఒకసారి జాబితాలో మాస్టర్‌ ప్లాన్‌ చేర్చాక అందులోని వాటిని తొలగించాలన్నా, కొత్తగా చేర్చాలన్నా  సెక్షన్‌ 15 ప్రకారం చేయాలి.

హెరిటేజ్​ కన్సర్వేటివ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని స్వయంగా హైకోర్టు 2015లో ఆదేశించినా ప్రభుత్వం చేయలేదు. రెగ్యులేషన్‌ 13ను చట్టంలో తొలగించినా హెచ్ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో కొనసాగుతున్నందున ఎర్రమంజిల్‌ భవనం వారసత్వ భవనమే అవుతుంది అని స్పష్టం చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాల్సి వస్తే.. సెక్షన్‌ 15 (3) ప్రకారం జరగాలి. స్థానికంగా రెండు దినపత్రికల్లో ప్రచురించి ప్రజాభిప్రాయాల్ని తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ యాక్ట్‌లోని 18ని ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అర్బన్‌ ఏరియాస్‌ యాక్ట్‌లోని 59 సెక్షన్‌కు అనుగుణంగానే జోనల్‌ రెగ్యులేషన్‌ 13ను తీసుకొచ్చినా దీనినీ ప్రభుత్వం విస్మరించింది అని డివిజన్​ బెంచ్ తెలిపింది. వారసత్వ భవనాల రక్షణకు రాజ్యాంగంలోని 21వ అధికరణం అండగా నిలుస్తుందని, 1972లో ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం వాటి రక్షణ బాధ్యత, వారసత్వ వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని స్పష్టం చేసింది.

ఎర్రమంజిల్ కట్టడాలను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ నిర్మాత నవాజ్​ ఫక్రుల్​ ముల్క్​ వారసుడు డాక్టర్‌ మిర్‌ ఆస్గార్‌ హుస్సేన్, డెక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి కె.జితేంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్​ను కోర్టు  ఆమోదిస్తూ ఈ తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఓయూ స్కాలర్‌ శంకర్, సామాజిక కార్యకర్తలు ఓఎం దేబ్రా, డాక్టర్‌ లుబ్నా సార్వత్, రిటైర్డు ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు, జిందాబాద్‌ హైదరాబాద్‌ సంస్థ ప్రతినిధి  యాదగిరి, ఇతరులు దాఖలు చేసిన పిల్స్‌ను పాక్షికంగా ఆమోదించింది. మంత్రివర్గం నిర్ణయాన్ని సవాల్‌ చేయడాన్ని సమర్థిస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. ఎర్రమంజిల్‌ బిల్డింగ్‌ కూల్చివేతను సమర్థిస్తూ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ  రామచందర్‌రావు చేసిన వాదన వీగి పోయింది. ఎర్రమంజిల్​ను హెరిటేజ్‌ భవనం జాబితా నుంచి తప్పించామని, కేబినెట్‌ తీసుకున్న విధానా నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని అదనపు ఏజీ వాదన చేయగా దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.

ప్రభుత్వం ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసులో వర్తించవని  స్పష్టం చేసింది. హెరిటేజ్‌ భవనాన్ని కూల్చొద్దని పిటిషనర్ల తరఫున సీనియర్​ లాయర్ ​ప్రకాష్‌రెడ్డి, లాయర్​ నళినీ కుమార్‌ వాదనల్ని హైకోర్టు ఆమోదించింది. నగరం గుర్తింపును, సంస్కృతిని చాటిచెప్పే వారసత్వ భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారసత్వ భవనాలను ధ్వంసం చేయడం ప్రజల గుర్తింపును వారి నుంచి దోచుకోవడం అవుతుంది. ఇది సిటీకి ఉండే తనదైన ప్రత్యేకతను దూరం చేస్తుంది. ఈ విషయాలను ప్రభుత్వం మరిచి పోవడానికి వీలులేదు. భవిష్యత్ కోసం ప్లాన్ చేయడం ఎంత ముఖ్యమో, గతాన్ని కాపాడి, సంరక్షించి, నిలబెట్టు కోవడం కూడా అంతే అవసరం అన్నది గుర్తించాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాలు హర్షం వ్యక్తం చేసాయి. ఈ నిర్ణయం ప్రజల విజయమని పేర్కొన్నాయి.

కామెంట్‌లు