తమిళ సినీవాలిలో అతడో సునామి..!
బతుకంత యుద్ధంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సైనికుడు కాదు అతడు. అతడో సునామి. సినిమా అన్నది కొందరికి వ్యాపారం. ఇంకొందరికి అదో ఛాలెంజ్. ప్రపంచాన్ని కాన్వాస్ లో బంధించే సాధనాల్లో సినిమా ఒకటి. అది లోకాన్ని పరుచుకున్న సముద్రం. భూమిని అల్లుకున్న ఆకాశం. ఇందులో తోడుకున్నోళ్లకు తోడుకున్నంత. చదువుతో పని లేదు. పైరవీలతో పని లేదు. బాకాలు ఊదాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నీకు నీ మీద అచంచలమైన నమ్మకం. మనల్ని ప్రతి క్షణం వెంటాడే కాలం సాక్షిగా యుద్ధం చేయాల్సిందే. అప్పుడే నిలబడతాం. లేకపోతే పడి పోతాం . ఈ పోరాటపు ప్రయాణంలో సినిమాను యుద్ధంగా చేసుకుని సాగిపోతున్న డైరెక్టర్లు ఇండియాలో ఎందరో ఉన్నారు.
వారిలో ఉన్న కొద్ది మందిలో ఎన్నదగిన వ్యక్తుల్లో ఒకరు తమిళంలో పేరొందిన బాల పళనిసామి. దర్శకుడిగా , స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా ఆయన ఇప్పటికే పేరొందారు. తమిళ సినిమా రంగంలో రెబల్ గా పేరు తెచ్చుకున్నారు బాల. సినిమా చవిచూడని, పట్టించుకోని అణగారిన వర్గాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సామాజిక ఇబ్బందులను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకే బాల అంటే అక్కడ ఎనలేని క్రేజ్. బాల తీసింది కొన్ని సినిమాలే. కానీ ఎన్నో అవార్డులు, పురస్కారాలు తెచ్చి పెట్టాయి. బాలకు ఇప్పుడు 56 ఏళ్ళు. కొత్తగా, డిఫరెంట్ గా తీసేందుకు పరితపిస్తాడు. క్రియేటివిటీకి పెట్టింది పేరు తమిళ సినిమా. అందుకే అతడికి లెక్కలేంతగా అభిమానులు ఉన్నారు. జాతీయ స్థాయిలో 6 , రాష్ట్ర స్థాయిలో 13 , ఫిలింఫెర్ అవార్డులు అందుకున్నారు. అంతే కాకుండా 14 ఇంటర్నేషనల్ స్థాయిలో పురస్కారాలు పొందారు బాల.
సినిమాలు ఎవరైనా తీస్తారు. అందులో జీవితం ఉండాలిగా . మనల్ని మనం ఆవిష్కరించుకోక పోతే ఎలా అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. అతడి సినిమాలో హీరోలు ఉంటారు కానీ పాత్రలే పవర్ ఫుల్. కథ మొత్తం డామినేట్ చేస్తుంది. తనవరకు వస్తే డైరెక్టర్ నిజమైన హీరో. మిగతా దర్శకులు హీరో , హీరోయిన్లను పరిగణలోకి తీసుకుని సినిమాలు తీసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ బాల అలా కాదు. సినిమా అన్నది శక్తివంతమైన ఆయుధం. చావడమా లేక చంపడమే చేయక పోతే ఎలా అంటాడు బాల. 1999 లో విక్రంతో సేతు సినిమా తీసాడు. తమిళ్ సినిమాలో సునామి సృష్టించింది. విక్రమ్ కు స్టార్ డమ్ తీసుకు వచ్చింది. తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్. అతడి సినిమా జనాన్ని తెర మీద ఆవిష్కరించిన తీరు గొప్పగా ఉంటుంది. నందా, పితామగన్ , మాయావి , నాన్ కధావల్, అవన్ ఇవాన్ , పరదేశి , పిసాసు , చాందీ వీరన్, తారాయ్ తప్పట్టై , నాచియార్ సినిమాలు బాలను సెన్సేషనల్ డైరెక్టర్ల సరసన నిలబెట్టాయి. ఇలాంటి దర్శకులు మనకూ ఉంటే బావుండునని అనిపిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి