పదవుల పందేరం..కుల సమీకరణలే కీలకం..?

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండవ సారి కొలువు దీరిన తెలంగాణ రాష్ట్ర సమితి మహిళలకు కేబినెట్ లో చోటు లేకుండానే పాలన కొనసాగిస్తూ వచ్చింది. మొదటి సారి ప్రభుత్వం పూర్తయింది. పద్మా దేవేందర్ రెడ్డికి విప్ పదవితో సరిపెట్టారు. కానీ కేబినెట్ లో ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక భారీ మెజారిటీతో రెండో సారి అధికారాన్ని చేపట్టిన సమయంలోను మహిళల భాగస్వామ్యం లేకుండానే మంత్రివర్గంను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. మాహిళా సాధికారత, సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమంటూ చెప్పుకుంటూ వచ్చిన సర్కార్ ఆరేళ్ళు గడిచినా వారి గురించిన ఊసే లేకుండా పోయింది.

కులాల సమీకరణాల ప్రాతి పదికన పదవుల పందేరం కొనసాగుతూ వచ్చింది. గతంలో ఏలిన పాలకులు రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తే దివంగత ఎన్ఠీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తగా కొలువు దీరిన సర్కార్ అత్యధికంగా వెలమ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు చిన్నజీయర్ స్వామితో ఉన్న సాన్నిహిత్యం తో మై హోమ్ జూపల్లి రామేశ్వర్ రావు తన హవాను నడిపిస్తున్నారు. ఏకంగా మీడియా సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యారు. ఈయన కూడా వెలమ వర్గానికి చెందిన వారు. వేలాది భూములు కొల్లగొట్టారంటూ ఆ మధ్య ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తర్వాత అది సద్దుమణిగింది.

మరో వైపు చిన్నజీయర్ స్వామిజి పర్యవేక్షణలో కొనసాగుతున్న యాదాద్రి ఆలయ నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఏకంగా శిలలపై కేసీఆర్ , కారు బొమ్మలు చెక్కారు. దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది. ఇంత జరుగుతుంటే ఆనంద సాయి నిద్ర పోయారా లేక తెలిసే ఊరుకున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక మాజీ ఎంపీ కవిత అనుచరుడిగా ముద్ర పడిన దాస్యం వినయ భాస్కర్ కు మంచి పదవే కట్టబెట్టారు. మరో వైపు ఈటెల ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి నెలకొన్నది. గత కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం తెలిపారు. దీంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు ప్రారంభించారు. మరో వైపు ఎంపీ ఒవైసీ ఏకంగా కేటీఆర్ కు మంత్రి పోస్ట్ ఇస్తే బావుంటుందంటూ చేసిన కామెంట్స్ విస్తు పోయేలా చేసాయి.

ఓ వైపు కొలువులు లేక అల్లాడుతుంటే పదవుల పందేరం ఎందుకంటూ నిరుద్యోగులు నిలదీస్తున్నారు. వీరి వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ , హరీష్, సబితా, గంగుల, సత్యవతి, పువ్వాడ, జోగు రామన్న , సండ్ర , లక్మారెడ్డి రేసులో ఉన్నారు. ఇద్దరు లేదా ముగ్గురికి బెర్త్ లో ప్లేస్ ఉండకపోవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పలువురికి విప్ లు, కార్పొరేషన్ పదవులతో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద దొర మనసులో ఏమున్నదో ఎవరికి ఎరుక. తెలుసు కోవాలంటే చిన్న జీయర్ ను అడగాలి లేదంటే రామేశ్వర్ రావు , కాదంటే ఆ లక్ష్మి నరసింహ్మ స్వామిని అడగాలి అంటున్నరు విపక్షాలు.

కామెంట్‌లు