!..వైకల్యాన్ని అధిగమించి..విజేతగా నిలిచి..! జయహో మానసి..!

ఓ వైపు పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడా విభాగంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టిస్తే, అదే ఇండియాకు చెందిన క్రీడాకారిణి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రపంచం నివ్వెర పోయేలా విజేతగా నిలిచింది. మువ్వొన్నెల భారతీయ పతాకాన్ని ఎగుర వేసింది. అన్ని అవయవాలు సరిగా ఉన్నా అమెరికా, డాలర్ల జపం చేసే ప్రబుద్దులకు పూర్తిగా వికలత్వం కలిగినా,  మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్ షిప్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఈ ప్లేయర్. ఒకుహరాను ఓడించి సింధు టైటిల్ నెగ్గక ముందే , ఇండియా నుంచి మానసి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నమెంట్ తో పాటే జరుగుతున్న వరల్డ్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పారా షట్లర్ మానసి జోషి మహిళల సింగిల్స్ ఎల్ ఎల్ -3 కేటగిరిలో స్వర్ణభేరి మ్రోగించింది.

ఈ అమ్మాయి వర్ధమాన ఆటగాడు పుల్లెల గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందింది. పరుల పర్మాన్ ను ఓడించి గెలుపొందింది. మహారాష్ట్ర కు చెందిన మానసి జోషి సాఫ్ట్ వెర్ ఇంజనీర్. ముంబైలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. 2011 లో రోడ్డుపై వెళుతుండగా అనుకోకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలును తొడ భాగం వరకు తొలగించారు. చేతి వేళ్ళు కూడా చిట్లి పోయాయి. నెలన్నర పాటు బెడ్ మీదే ఉన్నది . అంతా ఇక మానసి పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆమె ఏరోజైతే ఆస్పత్రిలో చేరిందో ఆరోజే తన వైకల్యాన్ని అధిగమించాలని కంకణం కట్టుకుంది.

చిన్నప్పటి నుంచి మానసికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఈ ఆటలోనే తానేమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంది. 2012 లో కృత్రిమ కాలు ధరించి మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టింది. 2014 లో జాతీయ స్థాయిలో ఆడి సత్తా చాటింది . గోపి అకాడెమీలో ట్రైనింగ్ తీసుకుంటూ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. సింగిల్స్ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. ప్రపంచం గుర్తు పెట్టుకునేలా ఆడింది మానసి. ఇప్పుడు ఆమెను చూసి ఈ జాతి యావత్తు గర్విస్తోంది. సలాం చేస్తోంది. కాలు కోల్పోయినా విజేతగా నిలిచిన ఆమె ప్రయత్నం గొప్పది కదూ. 

కామెంట్‌లు