కొలువులు సరే..వయసు మాటేమిటి..?

బంగారు తెలంగాణ పేరుతో దుమ్ము రేపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ళు కావస్తున్నా నేటికీ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు వరకు స్పష్టం చేయలేదు. పోరాటాలు, బలిదానాలు, ఆత్మహత్యలు, కేసులు, అరెస్టులతో కోరి తెచ్చుకున్న తెలంగాణాలో ఇప్పుడు ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉరే మిగిలేలా చేస్తోంది. ఇప్పటి దాకా 10 లక్షల మందికి పైగా కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎంతటి దుర్భర పరిస్థితి ఉన్నదో.

ఇక చిలుక పలుకులు పలుకుతున్న కేంద్రంలో రెండో సారి కొలువు తీరిన మోడీ సర్కార్ ఇందుకేమీ భిన్నంగా లేదు. ఎంత సేపు స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అసలైన శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో  ఇక కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. వేలాది మంది కాట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. విద్య శాఖా నిద్ర పోతుండగా , ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదు. కేజీ టూ పీజీ అంటున్నారే తప్పా మౌలిక వసతులకు దిక్కు లేకుండా పోయింది. మొత్తం మీద తెలంగాణను రియల్ ఎస్టేట్ కు వేదికగా మార్చారు.

 ప్రజలు , పరిశ్రమలకు నిత్యం అవసరమయ్యే విద్యుత్ సంస్థలలో వందలాదిగా ఖాళీలు ఉన్నాయి. అప్పుడో ఇప్పుడో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. అక్కడ పై స్థాయిలో ఉన్న వారంతా పదవీ విరమణ పొందిన వారే . ఏ శాఖలో లేనంతగా ఇక్కడ యూనియన్ నాయకుల హవా నడుస్తోంది. తాజాగా ఈ శాఖలో జూనియర్ లైన్ మెన్ , జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఎక్కడ లేని నిభందనలు ఈ సంస్థలో పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం 10 సంవత్సరాలను పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ ఆర్డర్ ను మాత్రం ఈ సంస్థ పట్టించు కోవడం లేదు. దీంతో వేలాది మంది ఇందులో పరిక్ష రాసే అవకాశాన్ని కోల్పోతారు. ఇప్పటికైనా దొరబాబులు నిరుద్యోగుల పట్ల కనికరం చూపిస్తే మేలు. 

కామెంట్‌లు