అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!
ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు.
వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారం అందజేస్తున్నాయి. వీరి సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రకటించింది. అక్షయపాత్ర సక్సెస్ కావడంతో కేవలం 5 రూపాయలకే ప్రతి రోజు హైదరాబాద్ లో జీహెచ్ఎంసి సహకారంతో , తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటుతో ఇస్కాన్ భోజనం పెడుతోంది. ఈ అరుదైన కార్యక్రమానికి భారీ ఎత్తున స్పందన లభించింది. రోజూ వేలాది మంది తమ ఆకలిని తీర్చుకుంటున్నారు.
ఇక ఇస్కాన్ చరిత్ర చెప్పలేనంత ఉన్నది., బెంగళూర్ లో అద్భుతమైన ఆలయం, ఆశ్రమం ఉన్నది. అలాగే తిరుపతిలో కూడా. ఇక ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది ఇస్కాన్. వీరు శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. అదే జీవితమని భావిస్తారు. వీరిది ప్రత్యేకమైన లోకం. ప్రభుపాద మొదటి సారిగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంను స్థాపించారు. కోట్లాది మంది ఇస్కాన్ లో సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను, భక్తి యోగములను ప్రచారం చేస్తుంటారు. ఇండియా అంతటా ఈ టెంపుల్స్ ఉన్నాయి. ప్రజలలో ధార్మిక చింతనను అలవర్చడం. ప్రపంచంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం. కృష్ణ తత్వాన్ని, భగవద్గీత ప్రవచనాలను, శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడం ఇస్కాన్ ఉద్దేశం. కృష్ణ భక్తులను పెంచడం. వీరిని ఒక వేదికపై తీసుకు రావడం,మానవతా వాదాన్ని పెంచడం, తద్వారా ఆత్మజ్ఞానాన్నిపొందడం దీని లక్ష్యం.
సంకీర్తనా ఉద్యమాన్ని ప్రోత్సహించడం, సామూహిక కీర్తనలు చేపట్టడం, తద్వారా చైతన్య మహాప్రభు బోధనలను అమలు పరచడం. భక్తుల కొరకు, ఆధ్యాత్మిక భవనాలను నిర్మించడం. భక్తులను, సభ్యులను దరిచేర్చి, సాత్విక జీవన చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం చేస్తుంది కృష్ణ సమాజం. భక్తులు స్వీయ నిగ్రహం, ధ్యానం, సత్యం, స్వీయ ప్రచ్ఛాళన పాటించేలా ప్రభు పాదులు ఇప్పటికే నిర్దేశించారు. ఇస్కాన్ రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది. అధునాత, సంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు భక్తులకు స్వాంతన కలుగ జేస్తున్నాయి. సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి. ప్రభుపాదులు చేపట్టిన హరే రామ హరే కృష్ణ తత్వం లోకాన్ని వెలిగిస్తోంది. ఆ వెలుతురును మనలోకి చేర్చుకుందాం. పదండి ..ఇంకెందుకు ఆలస్యం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి