దివి కేగిన సంగీత శిఖరం..ఖయ్యం సాబ్ అల్విదా
కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై ..అంటూ ఖయ్యం జహూర్ సాబ్ ఇక సెలవంటూ సంగీతపు అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తి వెళ్లి పోయారు. బాలీవుడ్ లో మరిచి పోలేని సంగీత దర్శకుడిగా నిలిచి పోయారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. గుండెల్ని పిండేసే సాహిత్యాన్ని తన పాటల్లోకి ఒలికించిన ఖయ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. 92 ఏళ్ళ వయసున్న ఆయన గుండె పోటుతో మృతి చెందడంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ను కోల్పోయింది ఈ దేశం. 1972 లో ఖయ్యం సాబ్ సంగీత దర్శకత్వం వహించిన కభీ కభీ సినిమా సంగీత పరంగా దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అభిమానులు లెక్కలేనంత మంది అతడు సృజియించిన పాటల జలపాతంలో ఓలలాడారు. ముఖేష్ , లతా మంగేష్కర్ ల గొంతులోని మాధుర్యాన్ని ఖయ్యం ఒడిసి పట్టుకున్నారు.
జీవితాంతం గుర్తుంచుకునేలా పాటలకు ప్రాణం పోశాడు. కొన్నేళ్లయినా ఇప్పటికీ ఆయన అందించిన సినిమాల్లోని పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. 1979 లో వచ్చిన నూరి సినిమా బిగ్ హిట్. రేఖ నటించిన ఉమ్రావ్ జాన్ , రజియా సుల్తాన్ , బజార్ లాంటి సినిమాలు ఖయ్యం సాబ్ అందించిన సంగీతం కారణంగా సక్సెస్ అయ్యాయి. ఇది అతడి సంగీతానికి ఉన్న మహత్తు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. కానీ ఇవేవి తనకు సంతృప్తిని ఇవ్వవని ఓ సందర్భంలో చెప్పారు ఖయ్యం. నా జీవితమంతా సంగీతంతోనే గడిచింది. కాలం మారొచ్చు ..కానీ సంగీతం ఎప్పటికి నిలిచే ఉంటుంది. 2011 లో భారత ప్రభుత్వం అత్యున్నత సేవలకు గాను పద్మభూషణ్ తో సన్మానించింది. 1953 నుంచి 1990 దాకా అంటే 37 ఏళ్ళ పాటు బాలీవుడ్ సినీ పరిశ్రమకు సంగీతాన్ని అందించారు ఖయ్యం సాబ్.
పంజాబ్ లోని రోహన్ లో పుట్టారు. లాహోర్ లో పేరొందిన బాబా చిస్తీ దగ్గర సంగీతం నేర్చుకునేందుకు శిష్యరికం చేశారు. ఆయన ఎక్కువగా చదువు కోలేదు. కానీ మ్యూజిక్ అంటే చెప్పలేనంత ఇష్టం. అదే అతడిని మరిచిపోలేని మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చేసింది. చిన్న వయసులోనే సంగీత రంగంలోకి ప్రవేశించారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నా సమయంలో ఖయ్యం తన కోరికను తీర్చుకునేందుకు బొంబాయి కి బయలు దేరాడు. శర్మాజీ-వర్మాజీ కంపోసర్ దగ్గర చేరాడు. అఖేలే మూవీలో రఫీతో చేసిన పాట హిట్. ఆ తర్వాత సాహిర్ లుధియాని తో పాటలు రాయించుకున్నాడు. ఆషా భోస్లే తో ఎక్కువగా పాడించాడు. షోలా ఔర్ షబ్నమ్ సినిమా తో ఖయ్యం షబ్ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాకు కైఫీ ఆజ్మి పాటలు రాశాడు. యాష్ చోప్రా డైరెక్షన్ లో వచ్చిన కభీ కభీ మూవీ జాతి యావత్తును షేక్ చేసింది. ముఖేష్, లతా, కిశోరె కుమార్ లతో పాడించాడు ఖయ్యం. షాహిర్ రాసాడు పాటల్ని. ఇవి బంపర్ హిట్ గా నిలిచాయి. ఇన్ ఆఖోకే మస్తీ ..అంటూ ఆశా పాడుతూ వుంటే జనం మైమరచి పోయారు. ఇలా ఎన్నో పాటల పొదరిల్లు ఏర్పాటు చేసిన ఈ సంగీత దిగ్గజం ఇక సెలవంటూ వెళ్లి పోయింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి