చిన్న వయసు..పెద్ద మనసు ..చిన్నారికి దేశం సలాం..!

పక్కనే వున్నా, ఆకలి కేకలతో అలమటిస్తున్నా పట్టించుకోని ప్రబుద్దులున్న ఈ దేశంలో పట్టుమని 12 ఏళ్ళు నిండని పోరడు పెద్దలు చేయని పనిని చేశాడు. సాటి మనుషుల్ని కాపాడాలంటే, కష్టాల్లో ఉన్న బాధితులను ఆదు కోవాలంటే వయసు అక్కర లేదని, గుండె నిండా ప్రేమ ఉంటే చాలని నిరూపించాడు. చుట్టూ వరద ముంచెత్తుతున్నా ప్రాణాలను పణంగా పెట్టాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించాడు. ఇదేదో సినిమా కాదు...వాస్తవం. కళ్ళ ముందు జరిగిన నిజం. ఈ అరుదైన..స్ఫూర్తి దాయకమైన కథ తెలుసు కోవాలంటే, అతడి గురించి చదవాల్సిందే .

కర్ణాటక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పంటలు నీటి పాలయ్యాయి. చాలా గ్రామాలలోకి నీళ్లు వచ్చి చేరాయి. రాయచూరు జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి కూడా వరద వచ్చింది. ఇదే సమయంలో ఆరు మంది బాధితులతో ఉన్న అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. కానీ వెళ్లలేని పరిస్థితి. ఆస్పత్రికి తీసుకు వెళ్లాలంటే ఊరు దాటాలి. భారీ వర్షం, కదలలేకుండా వరద ఉధృతి. ఈ సమయంలో వెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ భయపడ్డాడు. ఆలశ్యం చేస్తే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇదే సమయంలో దేవుడిలా వచ్చాడు 12 ఏళ్ళ వయసున్న వెంకటేష్ అనే బాలుడు. తాను వరదలో నడుస్తూ అంబులెన్స్ కు దారి చూపించాడు..

ఈ సమయంలో ఏదైనా అయితే వెంకటేష్ వరద తాకిడికి కొట్టుకు పోయే వాడు. కానీ అదేమీ పట్టించు కోలేదు. తానే దగ్గరుండి, ముందుండి నడిపించాడు. ప్రాణాలు కాపాడాడు. వయసు చిన్నదే అయినా పెద్ద మనసు చేసుకుని ధైర్య సాహసాలు ప్రదర్శించిన వెంకటేష్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. అంతే కాకుండా కర్ణాటక ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలు కలిగిన అవార్డు, ప్రసంశ పత్రాన్ని అందజేసింది. ఇప్పుడు వెంకటేష్ వీడియో దేశమంతటా వైరల్ గా మారింది. రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియా ఆ పిల్లాడి గురించి కథనాలు ప్రసారం చేసాయి. వెంకటేష్ ను చూసి దేశం గర్విస్తోంది..సలాం చేస్తోంది. ఇలాంటి పిల్లలే కావాలి మన కంట్రీకి. ఒకే ఒక్క పని అతడిని హీరో గా మార్చేసింది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!