అరుదైన నటీమణి జమున

పాత తరం నటీమణుల్లో సత్యభామ పాత్ర గురించి మాట్లాడు కోవాల్సి వస్తే మొదటగా గుర్తుకు వచ్చే పేరు జమున. ఏళ్ళు గడిచినా ఆమె అలాగే ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. సేవలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. కర్ణాటకలోని హంపిలో జన్మించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. నటిగా ఆమె పరిణితి చెందిన పాత్రలు ఎంచుకున్నారు. దానికి ప్రాణం పోశారు. తెలుగు స్వంత భాష కాకపోయినా ఇక్కడే పుట్టి ..ఇక్కడే పెరిగారు . తెలుగు చలనచిత్ర రంగంలో అరుదైన నాయకిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె అసలు పేరు జనాబాయి . తర్వాత జామునగా మార్చారు . బాల్యం మొత్తం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగింది . 
 
మరో పేరొందిన నటుడు జగ్గయ్యది కూడా అదే గ్రామం కావడంతో కొత్త పరిచయం కలిగింది. మొదటి నుంచి ఎలాంటి బెరుకు అన్నది లేక పోవడంతో ..బడిలో చదివే కాలంలోనే నాటకాల పట్ల మక్కువ పెంచుకుంది . ఇదే సమయంలో తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకు వెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడంతో  సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించింది.. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామగా  జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం తనకు మేలు చేసిందన్నారు ఓ సందర్భంలో. 

తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు సక్సెస్ గా నడిచాయి. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25  ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.  కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990 లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!