గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం - స‌వ‌రించిన ప్ర‌భుత్వం..!

తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు ఒక్కోసారి త‌ల‌నొప్పులు తెచ్చి పెడ‌తాయి అన‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ..పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీల ఖ‌రారుపై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అభ్యంత‌రం చెప్ప‌డం. యుద్ధ ప్రాతిప‌దిక‌న పుర‌పాల‌క చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తున్న‌ట్లు విధాన స‌భ సాక్షిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు స‌భ్యులు ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. కొత్తగా పుర‌పాల‌క చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది స‌ర్కార్. దీనిపై అభ్యంత‌రం చెబుతూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నాల వ్యాజ్యం కింద పిల్ దాఖ‌లైంది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్కార్ త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేదంటూ కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా త‌మకు అనుకూలంగా ఉండేందుకే ప్ర‌భుత్వం ఉన్న చ‌ట్టానికి తూట్లు పొడిచిందంటూ విప‌క్షాలు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించారు. దీంతో ప‌రిశీల‌న నిమిత్తం ప్ర‌భుత్వం పంపించిన పుర‌పాల‌క చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల్సిందేనంటూ తిప్పి పంపించారు.

ఈ సంద‌ర్భంగా, మున్సిప‌ల్ ఎన్నిక‌ల తేదీల‌పై ప్ర‌భుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో తెలియ చేయాల్సిందంటూ గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం తెలిపారు. కొత్తగా రూపొందించిన చ‌ట్టంలో నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని సూచించారు. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో స‌వ‌రించి ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర స‌ర్కార్. పుర‌పాల‌క ఎన్నిక‌ల డేట్స్ ను ప్ర‌క‌టించే అధికారం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంకు మాత్ర‌మే ఉంటుంది..కానీ ప్ర‌భుత్వానికి ఆ వెస‌లుబాటు ఉండ‌దు. ఈ ప‌వ‌ర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి క‌ల్పిస్తూ రూపొందించిన నూత‌న మున్సిప‌ల్ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకుని..ఆర్డినెన్స్ జారీ చేయ‌డంతో కొత్త పుర‌పాల‌క చ‌ట్టం -2019 అమ‌లులోకి వ‌చ్చింది. చ‌ట్టానికి అనుగుణంగా త్వ‌ర‌లో విధి విధానాలు ప్ర‌క‌టించ‌నుంది. దీని ప్ర‌కారమే రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఈ చ‌ట్టానికి ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న చేసింది. శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి..ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెల‌ప‌డంతో ఈ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది.

త‌యారు చేసిన బిల్లును ఆమోదం నిమిత్తం గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. న్యాయ నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు , సూచ‌న‌లు తీసుకుని ..తేదీలను నిర్ణ‌యించే అధికారం తెలంగాణ స‌ర్కార్‌కు లేనే లేదంటూ స్ప‌ష్టం చేశారు. వాటిని స‌వ‌రిస్తేనే సంత‌కం చేస్తానంటూ చెప్ప‌డంతో హుటాహుటిన ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసి..తిరిగి పంపించింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో ..కొత్త చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌లు, శాస‌న‌మండ‌లి ఎన్నిక‌లు, పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌లు ముగియ‌డంతో పుర‌పాలిక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది టీఆర్ఎస్ స‌ర్కార్. మ‌రో వైపు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవ‌డంలో భాగంగానే గులాబీ ప్ర‌భుత్వం ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తోందంటూ విప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేశాయి. అయినా స‌ర్కార్ లైట్‌గా తీసుకుంది. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు త‌న శ్రేణుల‌ను సిద్ధం చేసింది. కొత్తగా రూపొందిచిన పుర‌పాలిక బిల్లులోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ బీజేపీ ముందే చెప్పింద‌ని..ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని సీనీయ‌ర్ నేత బండారు ద‌త్త‌న్న తెలిపారు. ఇది ప్ర‌జాస్వామ్య విజ‌య‌మ‌న్నారు. 

కామెంట్‌లు