సంకీర్ణం స్వయం కృతాపరాధం .. యెడ్యూరప్పనే సీఎం..?
దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారిన కన్నడ రాజకీయం ఎట్టకేలకు సంకీర్ణ సర్కార్ విశ్వాస పరీక్ష వీగిపోవడంతో తెర పడింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసికట్టుగా కర్నాటకలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం దినదిన గండాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు టాటా చెప్పడం, ముంబయి హోటల్‌లో బస చేయడం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగడం, సీనియర్ నేత సిద్దిరామయ్య మంతనాలు జరిపినా చర్చలు కొలిక్కి రాలేదు. ఈ సర్కార్ కన్నడ నాట కొలువుతీరి సరిగ్గా 14 నెలలు గడిచింది. స్పీకర్ రమేష్ కుమార్ తీవ్ర వత్తిళ్లను ఎదుర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడైనప్పటికీ..అత్యంత హుందాగా వ్యవహరించారు. తన పరిమితులు, అధికారాల గురించి చాలా స్పష్టంగాఈ దేశానికి, ముఖ్యంగా కేంద్రంలో కొలువు తీరిన కమలనాథులు, మోదీ, అమిత్ షాలకు స్పష్టం చేశారు. సభాపతి రూలింగ్ ఇచ్చే విషయంలో, ప్రభుత్వాన్ని నడిపించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తారో, విధానసభలో ఆయన ఎంత పవర్ ఫుల్లో తేటతెల్లం చేశారు. స్పీకర్ పోస్టు అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, అది అత్యున్నత విలువతో కూడిన ప్రజాస్వామ్యానికి వాచ్ డాగ్ లాంటిదని చెప్పకనే చెప్పారు.
తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ కేంద్రంలో కొలువు తీరింది. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాలను మోదీ, షా టీం టార్గెట్ చేస్తూ పోయింది. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఏపీలను టార్గెట్ చేసింది. మరో వైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వర్కవుట్ కాలేదు. ఇక్కడ కేసీఆర్ ..మోదీతో అమీ తుమీ తేల్చుకునేందుకు రెడీగా ఉండడం, తెలంగాణలో కమలానికి అంత గా స్పందన లేక పోవడంతో కామ్‌గా వేచి చూస్తోంది. విపక్షాలలో బలమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ..తమ పార్టీలోకి చేర్చుకునే పనిలో ఉంది. అంతేకాకుండా మీడియా రంగంలో కూడా ఎంటరైందుకు పావులు కదుపుతోంది. ఎలాగైనా సరే దక్షిణాదిన కమలం పాగా వేయాలని చూస్తోంది. ఆ దిశగానే అమిత్ షా తన మెదడుకు పని చెపుతున్నారు. ఆయన ఆలోచలను తూచ తప్పకుండా రాంమాధవ్, జీవీఎల్ నరసింహారావులు అమలు చేస్తున్నారు. వీరి ప్లాన్ ఫలించింది. కర్నాటకలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. వీరి టీంలో ఉన్న సభ్యులను చీల్చడంలోను, వారిని ప్రలోభాలకు గురి చేయడంలోను యెడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సక్సెస్ అయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 103 మ్యాజిక్ ఫిగర్ ను కూడగట్టు కోవడంతో ఇక వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.
బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. స్పీకర్ రమేష్ కుమార్ , సిద్దిరామయ్య, కుమారస్వామి, దేవెగౌడ, డీకే శివకుమార్, తదితర ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్నా తమ ప్రభుత్వం కూలి పోకుండా కాపాడుకోలేక పోయారు. బహుషా కేంద్రంలోని కమల సర్కార్ దెబ్బకు చేతులెత్తేశారు. రెబల్ ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా వుంటూ వచ్చిన రామచంద్రారెడ్డి చివరలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్ధతు పలికినా ..బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు 15 మంది తిరిగి తమ మద్దతును ఇవ్వలేక పోయారు. దీంతో కొలువుతీరిన కుమార సర్కార్ కుప్ప కూలి పోయింది. ఈ సందర్భంగా స్పీకర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయన ఎలాంటి పక్షపాతాన్ని ప్రదర్శించలేదు. తన పరిమితుల గురించి గవర్నర్, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తన ధర్మాన్ని నిర్వహించి అటు సంకీర్ణ ప్రభుత్వాన్ని..ఇటు విపక్ష నేతల మనసుల్ని గెలుచు కోగలిగారు. ఈ సందర్భంగా సీఎం కుమార, స్పీకర్ రమేష్ కుమార్, డీకే శివకుమార్, సిద్దిరామయ్యలు ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేసినా ..సభలో మెజారిటీ లేక పోవడంతో ..తేలిపోయింది..ఇక సర్కార్ ఉండదని..మూణ్ణాళ్ల ముచ్చటేనని. మొత్తం మీద తాను సీఎం కావాలని కలలు కన్న యెడ్యూరప్ప ఆశలు ఫలించాయి. ఆయనే ముఖ్యమంత్రి అంటూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కన్నడ నాట రాజకీయం కొత్త మలుపులు తిరుగనుంది. బీజేపీ పవర్‌లోకి రావడంలో యెడ్డీ కీలక పాత్ర పోషించారు. మొత్తం మీద సక్సెస్ అయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి