విద్యాశాఖ నిర్ల‌క్ష్యం..టెట్ నిర్వ‌హ‌ణ‌లో జాప్యం..ఇక‌నైనా జ‌రిగేనా..?

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై చూపించిన శ్ర‌ద్ధ‌లో క‌నీసం ప‌దోవంతు చూపించినా విద్యాశాఖ‌లో ప్ర‌క్షాళ‌న జ‌రిగి వుండేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. వేలాది ఖాళీలు ఇంకా భ‌ర్తీ కావాల్సి ఉంది. స‌రిప‌డ‌నంత టీచ‌ర్లు లేరు. నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండ‌క పోవ‌డంతో భార‌మంతా ప్ర‌స్తుతం విధులు నిర్వ‌హిస్తున్న వారిపైనే భారం ప‌డుతోంది. దీంతో పాఠాలు స‌క్ర‌మంగా చెప్ప‌లేక స‌త‌మ‌త‌వుతున్నారు. ప్ర‌భుత్వ ప‌రిధిలోని పాఠ‌శాల‌లతో పాటు ప్రైవేట్ స్కూళ్ల‌ల్లో టీచ‌ర్లుగా ప‌నిచేయాలంటే కేంద్రం టీచ‌ర్ ఎలిజ‌బిలిటి టెస్ట్ (టెట్ ) త‌ప్ప‌క ఉత్తీర్ణులు కావాల్సిందేనంటూ కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తి ఏటా ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ‌ల‌తో పాటు కేంద్రం కూడా నేష‌న‌ల్ ఎలిజబిలిటి టెస్ట్ నిర్వ‌హిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యినా ఇంకా ఇంత‌వ‌ర‌కు టెట్ నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టికే టెట్ పాసై గ‌డువు పూర్త‌యిన అభ్య‌ర్థులు వేలాదిగా ఉన్నారు. వీరంతా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇక‌పోతే స‌మ‌గ్ర స‌ర్వ‌శిక్ష అభియాన్ ప‌థ‌కం కింద నిర్వ‌హిస్తున్న కేజీబివి స్కూళ్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించినా ఇంత‌వ‌ర‌కు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌లేదు.ఇదేమ‌ని అడిగితే టీఆర్‌టీ అభ్య‌ర్థుల‌తో నింపాక‌..ఖాళీలు ఏర్ప‌డ‌తాయ‌ని, వాటిని పూర్తి  చేస్తామంటూ ఎస్ఎస్ఏ ఎస్‌పీడీ సెల‌విచ్చారు. ఎక్క‌డైనా టీచ‌ర్‌గా ప‌ని చేయాలంటే టెట్ కంప‌ల్స‌రీ కావ‌డంతో ..ఉత్కంఠ‌కు లోన‌వుతున్నారు అభ్య‌ర్థులు. తెలంగాణ విద్యా శాఖ‌లో ఎన్నో ఏళ్ల నుంచి తిష్ట వేసుకుని కూర్చున్న అధికారుల‌కు టెట్ నిర్వ‌హించాల‌న్న సోయి లేకుండా పోయింది. ఉన్నత విద్యా శాఖ మంత్రి ఉన్నారో లేరో కూడా తెలియ‌దు. ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల కార‌ణంగా ఉన్న ప‌రువు పోగొట్టుకున్న స‌ద‌రు శాఖ ఈరోజు వ‌ర‌కు టెట్ గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆరు సార్లు టెట్ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత దాని ఊసే లేకుండా పోయింది. 2 ల‌క్ష‌ల 30 వేల మంది దాకా టెట్ ఎప్పుడు నిర్వ‌హిస్తారోన‌ని ఎదురు చూస్తున్నారు. ఓ వైపు టీఆర్టీకి మ‌రో వైపు గురుకులాల‌లో పాఠాలు బోధించేందుకు నోటిఫికేష‌న్లు వెలువ‌రించారు.

టెట్ గ‌డువు ముగిసినా విద్యా శాఖ నుంచి స్పంద‌న రాక పోవ‌డంతో దానినే అర్హ‌త‌గా చూపిస్తున్నారు. చాలా శాఖ‌ల మీద ప్ర‌భుత్వ ఆజ‌య‌మాయిషీ లేకుండా పోయింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఒక్క‌సారి టెట్ క్వాలిఫై అయితే రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. తెలంగాణ టెట్ నిర్వ‌హించి నిన్న‌టికి స‌రిగ్గా రెండేళ్ల‌యింది. అంటే అర్థం చేసుకోవ‌చ్చు..విద్యా శాఖ అధికారులు ఎంత బాగా ప‌నిచేస్తున్నారో. టెట్ నిర్వ‌హించకుండానే గురుకులాల నోటిఫికేష‌న్ వేస్తారేమోన‌ని మ‌రికొంద‌రు ఆందోళ‌న ప‌డుతున్నారు. టీఎస్‌లో 2016, 2017లో మాత్ర‌మే నిర్వ‌హించి చేతులు దులిపేసుకున్నారు. మ‌రో వైపు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఎస్జీటీ పోస్టుల‌కు బీఇడి వారు కూడా అర్హులేనంటూ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. టెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి నివేదిక పంపించామ‌ని..అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే ప‌రీక్ష పెడ‌తామంటూ విద్యాశాఖ క‌మిష‌న‌ర్ విజ‌య‌కుమార్ వెల్ల‌డించారు. మొత్తం మీద విద్యార్థులు, అభ్య‌ర్థుల జీవితాల‌తో తెలంగాణ స‌ర్కార్ ఆటాడుకుంటోందంటూ విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. 

కామెంట్‌లు