కర్నాటకం..ఆద్యంతం రసవత్తరం..స్పీకరే సుప్రీం..ఢిల్లీకి చేరిన రాజకీయం ..!
అంతులేని ట్విస్టులతో రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠకు..ఉద్వేగానికి లోను చేస్తున్న కన్నడ నాట రాజకీయం మరింత హీట్ ను పుట్టిస్తూ దేశ రాజకీయాలలో కొత్త చరిత్రకు తెర లేపింది కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా మారిపోతున్నాయి పరిస్థితులు. బల నిరూపణ జరగాల్సిందేనంటూ విపక్ష నేత యెడ్యూరప్ప డిమాండ్ చేశారు. బేషరతుగా జరిపి తీరాల్సిందేనంటూ తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి విధాన సభలో నిరసనకు దిగారు. అయినా స్పీకర్ రమేష్ కుమార్ ససేమిరా అన్నారు. తనకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, తనను ఎవరూ నియంత్రించ లేరని, తాను భారత రాజ్యాంగ బద్దంగానే నడుచుకుంటున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో కన్నడ రాజకీయం మరింత వేడిని రాజేసింది. దీనిపై కమలనాథులు భగ్గుమన్నారు. సంకీర్ణ సర్కార్ నుండి 15 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని, వారి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర సంకీర్ణ ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గుండూరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో కన్నడ పాలిటిక్స్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోను బల నిరూపణకు సిద్ధం కావాలని కర్నాటక గవర్నర్ స్పీకర్ ను ఆదేశించారు. ఆ మేరకు ఇవే ఆదేశాలు సీఎంకు కూడా వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. దీనిని స్పీకర్ రమేష్ కుమార్ పట్టించు కోలేదు. తనపై సుప్రీంకు కానీ, గవర్నర్‌ను కానీ ఆదేశించే అధికారం లేదంటూ స్పష్టం చేశారు. తాను పరిమితులకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నానని, ఎట్టి పరిస్థితుల్లోను ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి వేసే పని చేయబోనంటూ వెల్లడించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. యెడ్డీ ఆధ్వర్యంలో సభ్యులంతా తిరిగి గవర్నర్ వద్దకు వెళ్లారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం కలిగి ఉన్నామని వెంటనే బల నిరూపణ చేపట్టాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ స్పీకర్‌ను ఆదేశించినా ఫలితం లేక పోయింది. సంకీర్ణ ప్రభుత్వం మాత్రం తెలివిగా స్పీకర్‌ను వాడుకుంటోందంటూ యెడ్డీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా కుమారస్వామి ఆవేదనతో ప్రసంగించారు. కావాలనే కేంద్ర సర్కార్ కర్నాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు.
అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఇరువురు సభ్యులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బల నిరూపణపై మరో రెండు రోజులు గడువు విధించారు స్పీకర్. సభ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో కన్నడ నాట పాలిటిక్స్ హాట్ గా మారాయి. గవర్నర్ లేఖ రాయడంపై సీఎం కుమార స్వామి భగ్గుమన్నారు. తనకు ఏం అధికారముందంటూ నిప్పులు చెరిగారు. న్యాయం చెప్పండంటూ కుమార, గుండురావులు అత్యున్నత ధర్మాసనంను ఆశ్రయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ బీజేపీ ముఖ్య నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కిడ్నాప్ చేశారంటూ ధ్వజమెత్తారు. ఆ మేరకు స్పీకర్‌కు నిండు సభలో కిడ్నాప్‌కు పాల్పడిన దృశ్యాలతో కూడిన ఫోటోలను సమర్పించారు. దీంతో సభ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. ఒకరిపై మరొకరు తోసుకు వచ్చారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు డిక్లేర్ చేశారు. ఏది ఏమైనా బీజేపీని అధికారంలోకి రానివ్వ కూడదంటూ పావులు కదుపుతోంది. కేంద్రం, గవర్నర్, స్పీకర్, సీఎం, విపక్ష నేతలు ఎవరికి వారు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇంకా రెండు రోజులే ఉండడంతో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి