పురపాలిక ఎన్నికలకు ఎందుకంత ఆత్రం..?
తెలంగాణ అంటేనే ఎన్నికలకు పెట్టింది పేరు. సర్కార్ ఎన్నికల జపం చేస్తోంది. పాలన పడకేసింది. జిల్లా కలెక్టర్లు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమాలకు అన్ని కార్యాలయాలు అడ్డాగా మారాయి. బర్త్ , డెత్ సర్టిఫికెట్లు, ఆదాయ, కులం, స్థానిక సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తడపాల్సిందే. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆజమాయిషీ చేసే వారు కరువయ్యారు. మున్సిపాల్టీలు పర్మిషన్స్ కావాలంటే మరో జన్మ ఎత్తినంత పనవుతోంది. ప్రజల కష్టాలకు జవాబుదారీగా ఉండాల్సిన వారే కాటేస్తున్నారు. శాసనమండలి, విధానసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇపుడు పురపాలిక ఎన్నికలు మిగిలాయి. దీనికి తెర తీసింది టీఆర్ఎస్ సర్కార్. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి.
మున్సిపల్ పోల్స్‌పై ఎందుకంతటి ఉరుకులాట అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తమైన అభ్యంతరాలను పట్టించుకోనంతటి అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించింది. సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయి తెలంగాణ అంతట. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఉన్న వీటిని కేవలం ఒక్క రోజులో పరిష్కరిస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌తో పాటు టిఆర్ ఎస్ సర్కార్‌ను ఆదేశించింది. పురపాలిక ఎన్నికల కోసం ఎందుకు పరుగులు తీయాలి. అంత అవసరం ఏమొచ్చిందని. ఎందుకు స్పీడ్‌గా నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగు రోజులే గడువు ఎందుకిచ్చారు..? వాటికి ఒక్క రోజులోనే పరిష్కరిస్తారా..అంటూ నిలదీసింది.
ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల భాగస్వామ్యం. ఆ మాత్రం మరిచి పోతే ఎలా. మీరు కూడా అందులోంచి వచ్చారన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా..? ఎన్నికలకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆశ్రయించడం బహుశా ఇక్కడే జరిగి ఉంటుంది..అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశం పట్టనట్టుగా ఉండడం బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది. పురపాలిక ఎన్నికల కోసం వార్డుల విభజన, ఓటర్ల జాబితా ఖరారు, రిజర్వేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై వెలువడిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ నిర్మల్‌కు చెందిన అంజనీ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజల అభ్యంతరాలను పట్టించు కోకుండా నోటిఫికేషన్ జారీ చేశారని పిల్‌లో పేర్కొన్నారు. కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కొంత మెత్తబడింది. తేదీ అయితే ప్రకటిస్తాం..కానీ ఎన్నికలు నిర్వహించబోమంటూ కోర్టుకు తెలిపింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి