మోస్ట్ ఫేవ‌ర‌బుల్ బ్రాండ్‌..టాటా..!

కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో ప్రారంభించే కంపెనీల‌కు రేటింగ్ అత్యంత ముఖ్య‌మైన‌ది. వాటి ప‌నితీరు, మార్కెట్‌లో దాని స్థితిగ‌తులు, వార్షిక సంవ‌త్స‌రంలో దాని ప‌నితీరు మెరుగు ప‌డిందా లేదా..ఆదాయంలో ఏ పొజిష‌న్‌లో ఉన్న‌ది..భ‌విష్య‌త్‌లో ఎలా వుండ‌బోతోంద‌న్న దానిపై ప్ర‌తి ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా న‌మ్మ‌క‌మైన సంస్థ‌లు టాప్‌లో ఉన్న కంపెనీల‌ను ఎంపిక చేస్తాయి. మ‌న ఇండియా వ‌ర‌కు వ‌స్తే ర‌త‌న్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాటా కంపెనీ అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా నిలిచింది. త‌న స్థానాన్ని మ‌రోసారి నిలబెట్టుకుంది. అటు స‌ర్వీసులోను..ఇటు వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొంటూ త‌న వ్యాపారాన్ని అంత‌కంత‌కూ విస్త‌రించుకుంటూ పోతోంది టాటా. ప్ర‌ధాన రంగాల‌లో త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తోంది. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మందికి జీవ‌నోపాధి క‌ల్పిస్తోంది టాటా గ్రూపు. ఆటోమొబైల్ రంగంతో పాటు ఐటీ సెక్టార్‌లో టాటా కంపెనీలు దుమ్ము రేపుతున్నాయి.
ఐటీ ప‌రంగా టాప్ రేంజ్‌లో వుంది. టీసీఎస్ భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకుంటోంది.2019లో భార‌త్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ బ్రాండ్‌గా టాటా కంపెనీ నిలిచింది. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు చెందిన ఫైనాన్స్ ఆఫ్ ది నేష‌న‌న్స్ నిర్వ‌హించిన లీడింగ్ 100 బ్రాండ్స్ స‌ర్వే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. టాటాల బ్రాండ్ ఈ మ‌ధ్య కాలంలో అత్యంత వేగ‌వంతంగా పెరిగింద‌ని..తేల్చి చెప్పింది. మొత్తం కంపెనీల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ కంపెనీల వాల్యూ ఏకంగా ఒక్క సంవ‌త్స‌రంలోనే దాదాపు 37 శాతానికి పైగా పెరిగింద‌ని తెలిపింది. మొత్తంగా చూస్తే ఈ కంపెనీల విలువ 19.55 బిలియ‌న్ డాల‌ర్లుగా తేల్చింది. గ‌త ఏడాది 9 శాతం పెరిగి 14.23 డాల‌ర్లుగా పేర్కొంది. టాటాల త‌ర్వాతి స్థానంలో భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ జీవిత భీమా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా రెండ‌వ స్థానంలో నిలిచింది. 23 శాతం వృద్ధితో 7.32 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఆదాయం చేరిన‌ట్లు తెలిపింది.
ఇక‌..మూడో ప్లేస్‌లో నారాయ‌ణ‌మూర్తి స్థాపించిన ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్ కంపెనీ ఉండ‌గా..7.7 శాతం వృద్ధితో దీని బ్రాండ్ విలువ 6.5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాతి స్థానాల‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ‌హీంద్రా, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్, విప్రో సంస్థ‌లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ..మార్కెట్ అంచ‌నాల ప్ర‌కారం ఒక‌ప్పుడు టెలికాం రంగాన్ని ఒంటిచేత్తో శాసించిన ఎయిర్ టెల్ ఎంత వేగంగా పైకి ఎగ‌బాకిందో..అంతే త్వ‌ర‌గా త‌న బ్రాండ్ విలువ‌ను కోల్పోయింది. గ‌త ఏడాది తో పోలిస్తే దాదాపు 28 శాతం న‌ష్టానికి గురైంది. మ‌హీంద్రా గ్రూప్ కంపెనీ వాల్యూ మాత్రం గ‌ణ‌నీయంగా పెరిగింది. గ‌త ఏడాది ప్ర‌క‌టించిన జాబితాలో 12వ స్థానంలో ఉండ‌గా ఈసారి 5వ స్థానానికి చేరుకుంది. దీని విలువ అమాంతం 5.24 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. తొలి 100 స్థానాల్లో 14 స్థానాల‌ను బ్యాంకులే చేజిక్కించు కోవ‌డం గ‌మ‌నార్హం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!