వారెవ్వా వార్న‌ర్..పోరాడిన బంగ్లా

వార్ ఒన్ సైడ్ అవుతుంద‌ని భావించిన కంగారూల ఫ్యాన్స్‌కు దిమ్మ దిరిగేలా బంగ్లా ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. నిన్న‌టికి నిన్న విండీస్‌కు చుక్క‌లు చూపించిన ఈ జ‌ట్టు ..ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ పోరుకు తెర లేపింది. చివ‌రి వ‌ర‌కు ఆస‌క్తిక‌రంగా మారిన ఈ మ్యాచ్‌లో గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టుకు చెందిన డేవిడ్ వార్న‌ర్ రెచ్చి పోయాడు. విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఈ టోర్నీలో త‌న‌కు ఎదురే లేదంటూ హెచ్చ‌రిక‌లు పంపించాడు ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు. 147 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్ల‌తో 166 ప‌రుగుల భారీ స్కోర్ సాధించాడు. జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు వార్న‌ర్. సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారిన బంగ్లాకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

బంగ్లా ప‌సికూన‌లు పులుల్లా రెచ్చి పోయారు. ఆఖ‌రి వ‌ర‌కు ఆస్ట్రేలియ‌న్ల‌కు ద‌డ పుట్టించారు. ముష్పిక‌ర్ 97బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 102 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్ఫూర్తి దాయ‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు స్కోర్‌ను పెంచేందుకు దోహ‌ద ప‌డ్డాడు. ఆసిస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బంగ్లా మూడు ఓట‌ముల‌తో సెమీస్ అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టం చేసుకుంది. జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌ల‌న్నింటిని గెలుపొందాల్సిన ప‌రిస్థితిని కొని తెచ్చుకుంది. ముష్పిక‌ర్ పోరాటం వృధా అయింది. 48 ప‌రుగుల తేడాతో ఆసిస్ విజ‌యం స్వంతం చేసుకుంది. టాస్ గెలిచిన త‌క్ష‌ణ‌మే ఆసిస్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్ని ఎక్కువ ప‌రుగులు సాధిస్తే..ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేయొచ్చ‌న్న‌ది జ‌ట్ల ఆలోచ‌న‌. అదే జ‌రిగింది బంగ్లాతో. 5 వికెట్లు కోల్పోయి ఆసిస్ 381 ప‌రుగుల భారీ స్కోర్ టార్గెట్‌గా నిర్ణ‌యించింది.

డేవిడ్ వార్న‌ర్‌కు తోడు ఖ‌వాజ 72 బంతుల్లో 10 ఫోర్ల‌తో 89 ప‌రుగులు చేయ‌గా , ఫించ్ 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేశాడు. త‌ర్వాత ల్య‌క్ష ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన బంగ్లా జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 333 ప‌రుగుల‌కే అంతా ఆలౌట్ అయ్యారు. వ‌న్డే మ్యాచ్‌ల ప‌రంగా చూస్తే ఆ జ‌ట్టుకు ఇదే అత్యుత్త‌మ స్కోర్. ముష్ఫిక‌ర్‌కు తోడుగా మ‌హ్మ‌దుల్లా 50 బంతుల్లో 69 ప‌రుగులు చేయ‌గా ష‌కీల్ 41 ప‌రుగులు చేశాడు. ప్రారంభంలో ఆసిస్ పేస్‌ను గ‌ట్టిగానే ఎదుర్కొన్నారు బంగ్లా క్రికెట‌ర్స్. అడ‌పా ద‌డ‌పా ఫోర్లు కొడుతూ 100 ప‌రుగులు జోడించారు. 79 ప‌రుగులు జోడించాక షకీబ్‌ను స్టోయినిస్ పెవిలియ‌న్‌కు పంపించాడు. ఆ త‌ర్వాత వికెట్లు ట‌పాట‌పా రాలాయి. ఆసిస్ బౌల‌ర్ల ధాటికి టార్గెట్ చేదించ‌లేక బంగ్లా ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో దుమ్ము రేపిన డేవిడ్ వార్న‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది. 

కామెంట్‌లు