చంద్ర‌బాబుకు క‌టీఫ్..క‌మ‌లంతో దోస్తానా

సుదీర్ఘ‌మైన చ‌రిత్ర క‌లిగిన ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్న‌ది.ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అటు అసెంబ్లీలోను ఇటు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ సీట్ల‌ను చేజిక్కించుకుంది. ఊహించ‌ని రీతిలో ఓట‌మిని చ‌వి చూశారు తెలుగు త‌మ్ముళ్లు. అధినాయ‌క‌త్వం దీనికి పూర్తిగా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థ‌ల స‌మ‌రానికి వైసీపీ సై అంటుంటే టీడీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. త‌న కుటుంబంతో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరిన చంద్ర‌బాబుకు అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు టీజీ వెంక‌టేశ్, సుజ‌నా చౌద‌రి, సిఎం ర‌మేష్, గ‌రిక‌పాటిలు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. త‌మ రాజ్య‌స‌భ ప‌క్షాన్ని క‌మ‌లంలో విలీనం చేయాల‌ని కోరుతూ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు లేఖ అంద‌జేశారు.

త్వ‌ర‌లో మ‌రో ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని , అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత చేర్చుకోవాలో లేదా అన్న‌ది అపుడు పార్టీ హైక‌మాండ్ ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏపీ టీడీపీలో వీరి జంపింగ్ క‌ల‌క‌లం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త వైర‌ల్ కావ‌డం..అంత‌టా చ‌ర్చ‌కు దారి తీసింది. మ‌రో వైపు భ‌విష్య‌త్‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్న దానిపై కాకినాడ‌లో కాపు నేత‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశ మ‌య్యారు. రాజ్య‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీకి మొత్తం 6 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉండ‌గా అందులో పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ సుజ‌నా చౌద‌రి, డిప్యూటీ లీడ‌ర్ సిఎం ర‌మేష్, టీజీ వెంక‌టేశ్, గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు సైకిల్ కు టాటా చెప్పేశారు..క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు. వీరిని సాద‌రంగా త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామ‌ని పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జెపీ న‌డ్డా తెలిపారు. వీరి బాట‌లోనే మ‌రో ఎంపీ కూడా లైన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం .

దీంతో ఏపీలో రాజ‌కీయాలు మారింత వేడెక్కాయి. బాబు లేని స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డం ఒకింత బాధ‌కు గురి చేసింద‌ని, అయినా వారికి బాబు ఏం త‌క్కువ చేశారంటూ టీడీపీ సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. త్వ‌ర‌లో ఆ పార్టీ నుండి అధికంగా త‌మ పార్టీలోకి వ‌చ్చి చేరుతార‌ని దీంతో త‌మ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు క‌మ‌ల‌నాథులు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ పేరాగ్రాఫ్‌లోని అంశాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే వీరిని చేర్చుకున్నారు. యూర‌ప్ టూర్‌లో ఉన్న చంద్ర‌బాబు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ఆరా తీశారు. అయినా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింది. త‌మ ఆస్తుల‌ను కాపాడుకునేందుకే టీడీపీని వీడార‌ని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. మోడీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి చెందుతుంద‌న్న న‌మ్మ‌కంతోనే తాము పార్టీని వీడామ‌ని పార్టీ తీర్థం పుచ్చుకున్న టీజీ, ర‌మేష్‌, సుజ‌నా తెలిపారు. వీరి లోటును ఎలా పూడుస్తార‌నేది ప్ర‌శ్నార్థకంగా మారింది. 

కామెంట్‌లు