వారంలో ఒక రోజు - పోలీసుల్లో ఆనందం ..కుటుంబాల్లో సంతోషం
వాళ్లు మనలాంటి మనుషులే. మనమంతా ఇలా ఆనందంగా ఉన్నామంటే వారందిస్తున్న సేవలే. రక్షణ విభాగంలో కీలక భూమిక పోషిస్తూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా ప్రతి ఒక్కరికి 8 గంటల పని, వారంలో ఒక రోజు వారాంతపు సెలవు తీసుకుంటున్నారు. దర్జాగా కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఆయా ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతలు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి దాకా అమలు కాలేదు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చని ఏపీ సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరూపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన విధంగానే తక్షణమే పోలీసు శాఖలో ప్రతి ఒక్కరికి వీక్లీ ఆఫ్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పోలీసులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అమలు కాని వీక్లీ ఆఫ్ ను తమకు వర్తింప చేయడం ఆనందంగా ఉందంటున్నారు పోలీసు కుటుంబాలు. పొద్దున పోతే రాత్రికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వారంటున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న హోం గార్డులకు కూడా వర్తింప చేస్తామని వెల్లడించారు. ఏ ఒక్కరు ఇబ్బందులు పడుతూ ఉండకూడదన్న ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. తాజాగా ఏపీలో అమలు కావడంతో , తెలంగాణ వ్యాప్తంగా నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసులు తమకు కూడా వీక్లీఆఫ్ అమలు చేయాలని కోరారు.
దీనిని పరిగణలోకి తీసుకున్న టీఎస్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మొదటగా వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వీక్లీఆఫ్ వర్తింప చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను బట్టి వారాంతపు సెలవును వర్తింప చేస్తామని ప్రకటించారు సీపీ, ఎస్పీలు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో వీక్లీ ఆఫ్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నా..పలు ఇబ్బందుల కారణంగా అమలు కాలేదు. వరంగల్ సీపీ రవీందర్, మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ, సుబేదారి, హసన్‌పర్తి, మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, కాజేపట, మమూనూరు, మడికొండ, నర్సంపేట, పరకాల, వర్దన్నపేట, స్టేషన్ ఘణపూర్ పోలీస్ స్టేషన్‌లలో వీక్లీ ఆఫ్ అమలవుతుంది. ఒత్తిడిని జయించేలా శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దశల వారీగా రాష్ట వ్యాప్తంగా వారాంతపు సెలవు ఇవ్వనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి