కెప్టెన్సీకి రాహుల్ రాం రాం - కొలిక్కి రాని కొత్త సారథి
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతటి సంకట స్థితిని ఎదుర్కొంటోంది. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించిన పార్టీకి పేరున్నా ప్రస్తుతం జవసత్వాలు కోల్పోయి చతికిలపడింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలమైన క్యాడర్ కలిగిన పార్టీ ఇపుడు రథసారథి కోసం వెతుకుతోంది. నిన్నటి దాకా పార్టీ బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ దేశ్ కీ నేత అంటూ క్యాడర్ ప్రచారం చేసింది. రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేక పోయారు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా అందించలేక పోయారు. దీంతో పార్టీ ఓటమికి ..భారీ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ తాను కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే దేశ ప్రజల సాక్షిగా ప్రకటించారు.
రాహుల్ నిర్ణయాన్ని పార్టీకి చెందిన సీనియర్ లీడర్లతో పాటు తల్లి సోనియాగాంధీ, చెల్లెలు ప్రియాంక గాంధీలు ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చు కోలేదు. తమ కుటుంబం నుంచి కాకుండా వేరే ఎవ్వరికైనా పార్టీ బాధ్యతలు అప్పగించండంటూ లేఖ కూడా రాశారు ఈ యువనేత. మోడీపై, బీజేపీపై ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దేశ వ్యాప్తంగా పర్యటించి సమస్యలపై ఎక్కు పెట్టారు. ఏకంగా ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఓడి పోయారు. ఇది ఊహించని పరిణామం. కొంత కాలం పాటు తనకు ప్రశాంతంత కావాలని వెళ్లిపోయారు. మీడియా ముందుకు రాలేదు. పొత్తులో భాగంగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా బెడిసి కొట్టింది.
మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా భజాయించింది. తన హవాను కొనసాగించింది. మోదీ అండ్ షా నేతృత్వంలోని టీం సమర్థవంతంగా పనిచేసింది. దేశంలోనే ఏ పార్టీపై ఆధారపడకుండా ఒంటరిగానే కేంద్రంలో పవర్‌లోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ కనీసం 100 సీట్లను కూడా రాబట్టుకోలేక పోయింది. జనం నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. సీనియర్లను నమ్ముకుని ఇప్పటికీ వేలాడుతుండడంతో యువతీ యువకులను పట్టించు కోక పోవడంతో ఓటమిని కొనితెచ్చుకుంది. ఎన్నికలు జరిగేకంటే ఏడాది ముందే బీజేపీ పక్కా ప్లాన్‌ను అమలు చేసింది. చాప కింద నీరులా జనాన్ని ప్రభావితం చేసింది. ఆయా రాష్ట్రాలలో తమకు ఏది అనుకూలమైన నియోజకవర్గమో అంచనా వేసి అక్కడ అభ్యర్థులను నిలిపారు. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది.
దేశమంతటా తన హవాను కొనసాగిస్తే..తమిళనాడులో మాత్రం మోదీ చమక్కులు..అమిత్ షా గిమ్మిక్కులు పని చేయలేదు. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే గెలుపొందింది. ఇక రాహుల్ విషయానికి వస్తే..తన వారసుడు ఎవరనే దానిపై రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. తాను మాత్రం పార్టీ రథసారథి రేసులో లేనని స్పష్టం చేశారు. తాను సామాన్య కార్యకర్తగానే ఉంటానని ప్రకటించారు. పార్టీ సమావేశమై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని అంతదాకా వేచి చూడాలని కోరారు. బీజేపీ సంక్షేమ పథకాల బూచీ చూపి ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్‌లో అక్రమాలు జరిగాయని ఇప్పటికీ తాను నమ్ముతున్నానని తెలిపారు. జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ సీపీసీకి ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు. మొత్తం మీద కాంగ్రెస్ టీంకు ఎవరు కెప్టెన్ అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి