విప్రోకు త్వరలో ప్రేమ్‌జీ సెలవు..!
విజయానికి, నమ్మకానికి, నాణ్యతకు కేరాఫ్‌గా మారిన విప్రో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గణీనీయమైన వృద్ధి కలిగిన ఐటీ కంపెనీలలో ఒక కంపెనీగా స్థానం దక్కించుకుంది. దీని వెనుక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది తో పాటు ఆ సంస్థకు ఛైర్మన్‌గా వున్న అజీం ప్రేమ్‌జీ కష్టం వుందని చెప్పాల్పి వుంటుంది. అంచెలంచెలుగా ఆ సంస్థను తన కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకున్నారు ప్రేమ్‌జీ దంపతులు. ఒకప్పుడు వంట నూనెల ఉత్పత్తితో ప్రారంభమైన విప్రో..ఇపుడు అన్ని రంగాలకు విస్తరించింది. ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీల సరసన నిలిచింది. పొరుగు సేవలతో పాటు ఉద్యోగులకు పూర్తి భద్రత , సౌకర్యాలను కల్పించడంలోను విప్రో అన్ని ఐటీ కంపెనీల కంటే ముందంజలో ఉంటోంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ కంపెనీని కావాలని కోరుకుంటున్నారు.
కంపెనీ పరంగా గడించిన ఆదాయంలో సగానికి పైగా డబ్బులను సమాజ సేవ కోసం, విద్య, ఉపాధి, సామాజిక రుగ్మతలను రూపు మాపడంలో అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. సమాజం నుంచి ఏం తీసుకున్నామో ..ఏదో రూపంలో తిరిగి ఇవ్వడం మన కనీస ధర్మం అంటారు ఓ సందర్భంలో అజీం ప్రేమ్‌జీ. చిన్న స్థలంలో ప్రారంభమైన విప్రో కంపెనీ ఇపుడు విస్మరించలేని బ్రాండ్ గా ఎదిగింది. తన స్థానానికి ఎదురే లేకుండా చేసుకుంది. విప్రోకు మూల స్తంభంగా నిలిచిన ప్రేమ్‌జీ ..వచ్చే నెల జూలై 30న కార్యనిర్వాహక పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బోర్డులో కొనసాగనున్నారు. ప్రేమ్‌జీ హోదాను వ్యవస్థాపక ఛైర్మన్‌గా కూడా మార్చడంతో ..ఐదేళ్ల పాటు 2024 జూలై 31 దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ..విప్రో బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
ప్రేమ్‌జీ వైదొలిగిన తక్షణమే ఆయన కుమారుడు, కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ ఆ పగ్గాలు చేపడతారు. అదే కాలానికి హోల్ టైం డైరెక్టర్‌గా రిషద్ ను నియమిస్తున్నట్లు విప్రో తెలిపింది. ప్రస్తుతం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న అబిదాలీ నీముచ్ వాలా హొదాను కూడా సిఇఓ, ఎండీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులన్నీ వచ్చే నెలాఖరు నుంచి అమలులోకి వస్తాయని విప్రో తెలిపింది. అయితే ప్రేమ్‌జీ ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, వైద్య పరికరాల తయారీలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, విప్రో-జీఈ హెల్త్‌కేర్ బోర్డు సారథిగా కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది.
ప్రతి ఏటా విప్రో 850 కోట్ల డాలర్ల ఆదాయాన్ని గడిస్తోంది విప్రో ఐటీ కంపెనీ. దీనిని తీర్చిదిద్దిన ఘనత మాత్రం అజీం ప్రేమ్‌జీదే. జూలై 30 నాటికి 74 ఏళ్లు నిండుతాయి. 55 ఏళ్ల పాటు కంపెనీకి నాయకత్వం వహించిన ప్రేమ్‌జీ ప్రస్తుత పదవీ కాలపరిమితి ఆరోజుతో ముగుస్తుంది. భారతీయ పురస్కారాలు పద్మభూషణ్, పద్మ విభూషణ్ లను పొందారు అజీమ్. భారతీయ కుబేరుల్లో ప్రేమ్‌జీ రెండో స్థానంలో నిలిచారు. క్రియాశీల బాధ్యతల నుంచి వైదొలిగిన తక్షణమే ధార్మిక కార్యకలాపాలకు అధిక సమయం కేటాయించనున్నట్లు ఈ సందర్భంగా ప్రేమ్‌జీ తెలిపారు. ఆద్యంతమూ విలువలకు పెద్దపీట వేస్తూ..లాభాల బాటలో పయనించేలా విప్రోను తీర్చిదిద్దిన ఘనత మాత్రం అజీమ్‌దే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి