ఐపాక్‌తో బాబు డీల్ ఓకేనా..?

అపర చాణుక్యుడిగా, అపార‌మైన అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ‌వేత్త‌గా, నాయ‌కుడిగా నారా చంద్ర‌బాబు నాయుడుకు పేరుంది. తొమ్మిదేళ్ల పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. హైద‌రాబాద్‌ను ఐటీ ప‌రంగా ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెట్టిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. మొద‌ట్లో తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర ప‌డిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ఉద్య‌మాలు, పోరాటాల దెబ్బ‌కు దిగివ‌చ్చారు. స్వంతంగా కేంద్రానికి ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం లేఖ కూడా ఇచ్చారు. ఆ త‌ర్వాత అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ఉమ్మ‌డి రాష్ట్రాల ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి రాగా..ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.

ఇరు రాష్ట్రాలు పంతాలకు పోయి..ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు ఇద్ద‌రు చంద్రులు. చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఓటుకు నోటు కేసు కూడా బాబును కొంచెం ఇబ్బంది పెట్టింది. అనంత‌రం జ‌రిగిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ స్థానాల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఊహించ‌ని రీతిలో చంద్ర‌బాబుకు ఘోర‌మైన ప‌రాభ‌వం ద‌క్కింది. అభివృద్ధి ధ్యేయంగా ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. వంద‌లాది కంపెనీల‌తో ఎంఓయు కుదుర్చుకున్నారు. అమ‌రావ‌తిని అద్భుత‌మైన రాజ‌ధానిగా తీర్చిదిద్దాల‌ని సంక‌ల్పించారు. ఆ దిశ‌గా అడుగులు కూడా వేశారు. మౌళిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్లాన్ చేశారు.

నాయ‌కుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తూ పోయారు. చివ‌ర‌కు పార్టీని కాపాడుకుంటూ..న‌మ్ముకుంటూ ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌లను, అభిమానుల‌ను రెండో శ్రేణి నాయ‌క‌త్వం విస్మ‌రించింది. దీంతో కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోవ‌డంతో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రో వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడు స్థానాల‌తో స‌రిపెట్టుకుంది టీడీపీ. ఇది కూడా ఓ ర‌కంగా పెద్ద దెబ్బ‌. గ‌త కొంత కాలంగా ఒకే కులానికి చెందిన ఓట్లు గంప‌గుత్త‌గా టీడీపీకి ప‌డుతూ వ‌చ్చాయి. ఈసారి అది కూడా మిస్స‌యింది.

ఒక్క అడుగుతో ప్ర‌యాణ‌మైన వైసీపీ ప్ర‌స్థానం ఉన్న‌ట్టుండి దాని గ్రాఫ్ 90 శాతానికి చేరుకుంది. ఇది కూడా ఓ రికార్డు. 175 సీట్ల‌కు గాను 151 సీట్లు చేజిక్కించుకుంది జ‌గ‌న్ నేతృత్వంలోని ఆ పార్టీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి ఒకే ఒక్క స్థానం ద‌క్కింది. అయితే ఈసారి ఆ పార్టీ టీడీపీ అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించింది. అది కూడా వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. వైసీపీని విజ‌య తీరాల వైపు తీసుకెళ్ల‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించింది మాత్రం ఐపాక్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ..ప్లాన‌ర్, స్ట్రాట‌జిస్ట్ ..ప్ర‌శాంత్ కిషోర్. జ‌గ‌న్ గెలుపులో 70 శాతం పీకేదే.

దీంతో చంద్ర‌బాబు ..పీకేతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కొన్ని న్యూస్ ఛాన‌ల్స్ లో కూడా ప్ర‌సార‌మ‌య్యాయి. ఎంద‌రికో రాజ‌కీయ భిక్ష పెట్ట‌డ‌మే కాకుండా, దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నేత‌గా చంద్ర‌బాబు నాయుడుకు పేరుంది. ఐపాక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆయా పార్టీల‌కు స్ట్రాట‌జీ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు. అంతా ఆ సంస్థే చూసుకుంటుంది. సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియా, ప్లానింగ్, వ‌ర్క‌వుట్ చేయ‌డం అంతా పీకేదే బాధ్య‌త‌.

ప్ర‌త్య‌ర్థుల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లను గుర్తించ‌డం ..అందుకు అనుగుణంగా ప్లానింగ్ రూపొందించ‌డం ఐపాక్‌దే. కొన్నేళ్ల పాటు కాంట్రాక్టు కుదుర్చుకున్న‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఐపాక్ ముందు మోదీతో ఒప్పందం చేసుకుంది. ఆయ‌న ప‌వ‌ర్‌లోకి వ‌చ్చారు. జ‌గ‌న్‌తో ఎంఓయు కుదుర్చుకున్నారు. అక్క‌డ కూడా వ‌ర్క‌వుట్ అయింది. దీంతో పీకేకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. మ‌రి అప‌ర చాణుక్యుడు చంద్ర‌బాబుకు ..అప‌ర స్ట్రాట‌జిస్ట్‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిషోర్‌లు క‌లిస్తే ..ఇంకేమైనా వుందా..అదో దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన వార్త‌గా మిగిలి పోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!