ఆర్థిక నిపుణుడికి ఇక సెల‌వు

ఎంద‌రో ప్ర‌ధాన‌మంత్రులు ఈ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించారు. దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో వున్న‌ప్పుడు ..దిశా నిర్దేశ‌నం చేయాల్సిన స‌మ‌యంలో సంయ‌మ‌నం కోల్పోకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టిన ఘ‌న‌త మ‌న్మోహ‌న్ సింగ్‌దే. అపార‌మైన విజ్ఞానం, రాజ‌కీయ ప‌రిణ‌తి సాధించిన ఈ మేధావి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే మిగ‌తా ప్ర‌ధాన‌మంత్రుల‌కంటే ఆయ‌న భిన్న‌మైన వ్య‌క్తి క‌నుక‌. ఇవాళ ఆయ‌న గురించి మ‌రింత‌గా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా వున్న‌ది. ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడూ మాట్లాడుకోలేం. భార‌త‌దేశం అత్యున్న‌త‌మైన ప్ర‌జాస్వామ్యానికి ప‌ట్టుకొమ్మ‌గా నిలుస్తోంది. జాతులు, మ‌తాలు, కులాలు, వ‌ర్గాలు, వైష‌మ్యాలు, ద్వేషాలు, ఆర్థిక అస‌మాన‌త‌లు అన్నీ వున్న‌ప్ప‌టికీ అపార‌మైన జాతి సంప‌ద కొలువై ఉన్న‌ది. అదే ఈ దేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉప‌యోగ‌ప‌డుతూ వ‌స్తున్న‌ది. మీ దేశానికి వున్న బ‌లం ఏమిటి అన్న ప్ర‌శ్న‌కు చైనాకు చెందిన అధినేత ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

మా దేశంలో నివస్తున్న స‌మ‌స్త జ‌న‌మే మా బ‌లం అని ధీటుగా జవాబు ఇచ్చారు. అదే మ‌న్మోహ‌న్ సింగ్ ..మా ప్ర‌జ‌లే మాకు సంప‌ద అని అభివ‌ర్ణించారు ఆయ‌న‌కంటే ముందే. కానీ ఎంద‌రు గుర్తు పెట్టుకుంటారు ఆయ‌న‌ను. స‌ముద్రం కంటే ఎక్కువ‌గా రాజ‌కీయాలు స‌మ్మిళ‌త‌మై వుండే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన నాయ‌కుడిగా ఆయ‌న గుర్తుండి పోతారు. ప్ర‌ధాన‌మంత్రిగా అత్యున్న‌త‌మైన ప‌ద‌విని అలంక‌రించిన ఈ ఆర్థిక‌, రాజ‌కీయ వేత్త‌, మేధావి ..ఏ ఒక్క రోజు త‌న కాలాన్ని వేస్ట్ చేయ‌లేదు. త‌న మేధో సంప‌త్తిని, అనుభ‌వాన్ని ఈ దేశం కోసం వినియోగించారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. పీవీ హ‌యాంలో మొద‌లైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ఒక‌ర‌కంగా దేశానికి మంచి చేస్తే ..ఇంకో ర‌కంగా ఆర్థిక ప్ర‌గ‌తి మెట్ల‌కు అడ్డంకులుగా మారాయి. హిందూస్తాన్‌గా ప్ర‌క‌టించుకునే క‌మ‌ల‌నాథులు స్వ‌దేశీ నినాదాన్ని అందుకున్నారు.

దేశ వ్యాప్తంగా ప‌రివ్యాప్తం చేశారు. ఇపుడు వారే ఇత‌ర దేశాల‌తో స్నేహ హ‌స్తం చాస్తున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రువులు ఉండ‌ర‌న్న వాస్త‌వాన్ని నిజం చేశారంతే. సుదీర్ఘ కాలం పాటు త‌న‌దైన ముద్ర వేసిన మ‌న్మోహ‌న్ సింగ్ ..రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ కాలం ముగిసింది. 30 ఏళ్ల రాజ‌కీయ జీవితం దీంతో తెర ప‌డిన‌ట్ల‌యింది. క్షీణ ద‌శ‌లో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన వ్య‌క్తిగా చిర‌కాలం ఆయ‌న గుర్తుండి పోతారు. యూజీసీ ఛైర్మ‌న్‌గా ఉన్న ఆయ‌న‌ను ఆర్థిక మంత్రిగా పీవీ నియ‌మించారు. సంస్క‌ర‌ణ‌ల‌తో దేశాన్ని ఒడ్డున ప‌డ‌వేశారు. ఆయ‌న హ‌యాంలో అమ‌లైన స‌ర‌ళీకృత ఆర్థిక విధానాలు దేశ గ‌తిని మార్చేశాయి. ఐదేళ్ల పాటు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి..ప్ర‌పంచ మార్కెట్‌కు ద్వారాలు తెరిచారు. దీంతో వేలాది మందికి ఉపాధి దొరికింది. 2004లో యుపీఏ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు సోనియాగాంధీ మొద‌ట‌గా మ‌న్మోహ‌న్ సింగ్‌నే పీఎం ప‌ద‌వికి సూచించారు.

అంటే ఆయ‌న ప‌ట్ల ఆమెకు..పార్టీకి ఎంత న‌మ్మ‌కమో అర్థం చేసుకోవ‌చ్చు. ఎన్నో కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు. ఆయా ప‌ద‌వుల‌కు త‌న ప‌నితీరుతో గౌర‌వాన్ని తీసుకు వ‌చ్చారు. లెక్క‌లేన‌న్ని పుర‌స్కారాలు, అవార్డులు పొందారు. దేశ‌పు ఆర్థిక బ‌లాబ‌లాలు క్షుణ్ణంగా తెలిసిన వ్య‌క్తి. ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు వెళ్ల‌ని మ‌న్మోహ‌న్ సింగ్ మొద‌టిసారిగా మోదీపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేదు. దేశం ప‌ట్ల కూడా అని స్ప‌ష్టం చేశారు. ఏ ఒక్క రోజు సెల‌వు కూడా ఉప‌యోగించు కోకుండా త‌న ప‌ద‌విని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించిన ఈ ఆర్థిక‌వేత్త లేకుండా రాజ్య‌స‌భ ఉండ‌డం బాధను క‌లుగ చేస్తోంది. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మున్న‌త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కు ఒకింత దెబ్బ‌. ఇలాంటి మేధావులు, ఆర్థిక నిపుణులు కొద్ది మందే వుంటారు. వారిని ప‌దిలంగా గుర్తుంచు కోవ‌డం, గౌర‌వించ‌డం మ‌న బాధ్య‌త‌.

కామెంట్‌లు