పాకిస్తాన్‌కు ఝలకిచ్చిన భారత్ - కొనసాగిన విజయ పరంపర
కోట్లాది భారతీయుల ఆశలను సజీవంగా వుండేలా చేసింది విరాట్ నాయకత్వంలోని ఇండియా జట్టు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసిన పాకిస్తాన్, ఇండియాల మధ్య జరిగిన హోరా హోరీ పోరులో అందరూ అనుకున్నట్టుగా గానే భారత క్రికెటర్లు చెమటోడ్చారు. అద్భుత విజయాన్ని స్వంతం చేసుకున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని మిగిల్చారు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ క్రికెట్ టోర్నమెంటలలో పాక్‌పై ఓటమి అన్నది ఎరుగకుండా విజయం సాధించడం మామూలై పోయింది. ఇలా వరుసగా గెలుపొందడంతో అరుదైన రికార్డు భారత్ జట్టు పేరిట నమోదైంది.
శిఖర్ ధావన్ గాయం కారణంగా అర్ధాంతరంగా వైదొలగినా అతడి స్థానంలో ఓపెనర్ గా కెఎల్ రాహుల్ సంయమనం కోల్పోకుండా ఆడాడు. పటిష్టమైన స్థితికి జట్టును చేర్చాడు. రోహిత్ శర్మతో కలిసి భారీ స్కోరు సాధించేందుకు దోహద పడ్డాడు.టోర్నీలో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించుకుంది కోహ్లి సేన. వైస్ కెప్టన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ ప్రదర్శించాడు. సూపర్ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించాడు. మరో వైపు ఇండియన్ బౌలర్ కుల్‌దీప్ బౌలింగ్‌తో పాక్ జట్టు ఓటమి పాలయ్యేలా చేశాడు. కోట్లాది మంది టీవీలకు అతుక్కు పోయారు. ఆద్యంతం ఈ మ్యాచ్ ఉత్కంఠకు తెర లేపింది. దీంతో పెవిలియన్ అంతటా భారత జాతీయ పతాకాలు రెప రెపలాడాయి. అభిమానుల నినాదాలతో దద్దరిల్లింది స్టేడియం అంతటా. ఎప్పుడూ లేనంతగా ఈ మ్యాచ్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇండియా జట్టు.
ఏ స్థాయిలోను పాకిస్తాన్ పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌పై ఇరు దేశాలకు చెందిన అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. మొదటి నుంచి టీమిండియా ఫెవరేట్‌గా పేర్కొంటూ వస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. పాకిస్తాన్‌పై 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టులో రోహిత్ 140 పరుగులు చేశాడు. 113 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. కోహ్లి 65 బంతుల్లో 77 పరుగులు చేయగా , రాహుల్ 78 బంతుల్లో 57 పరుగులు చేసి స్కోరును పరుగులు తీయించారు. 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.
పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులకే పరిమితమైంది. ఫకర్ జమాన్ ఒక్కడే 62 పరుగులు చేసి పరువు పోకుండా కాపాడాడు.భారత్ బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ 32 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా..విజయ్ శంకర్ 22 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లను కూల్చాడు. హార్దిక్ పాండ్యా 44 పరుగులు ఇచ్చి ఇద్దరిని ఔట్ చేశాడు. భారత జట్టు భారీ స్కోర్‌లో కీలక భూమిక పోషించి..విజయం సాధించేందుకు దోహద పడిన క్రికెటర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో ఇండియాకు ఇది మూడో విజయం. మరో మ్యాచ్‌లో భారత్ ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి