రాజగోపాల్‌రెడ్డి సంచలనం - కాంగ్రెస్ లో కలకలం
తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ రాజుకుంటూనే వుంటాయి. ఇక్కడి జనాలకు చైతన్యం ఎక్కువ. అందుకే ఎవరు మాట్లాడినా అది వైరల్ అవుతూనే వుంటుంది. ఏపీ, టీఎస్ పాలిటిక్స్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్, జేసీలకు ఓ ప్రత్యేకమైన బ్రాండ్ వుంది. నల్లగొండ జిల్లాలో అన్నదమ్ములిద్దరికి మంచి పట్టుంది. ప్రజల మధ్య వీరిద్దరూ ఎక్కువగా వుండడం ప్లస్ పాయింట్. ఈసారి సీన్ రివర్స్ అయింది. తమ్ముడు ఎంపీగా గెలిస్తే..అన్న ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా అన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇంఛార్జ్ తో పాటు రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై పార్టీ పరంగా తీవ్ర చర్చలు జరిగాయి. మరో వైపు పార్టీ హై కమాండ్ వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, దానికి సరైన నాయకత్వం లేదని, అందువల్లనే ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి కొనితెచ్చుకుందని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయనకు మద్ధతుగా కొందరు నిలిస్తే మరికొందరు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కంటే ప్రస్తుతం బీజేపీనే బెటర్ అంటూ స్పష్టం చేశారు. ఇద్దరూ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ఆశించారు. తమ్ముడు కోమటిరెడ్డి మాత్రం తన చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటానని, తన శవం మీద కాంగ్రెస్ జెండా కప్పాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో టీఎస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఇంకో వైపు సీనియర్ నాయకుడు వి.హెచ్. హన్ముంత్ రావు మాత్రం తనకు రాహుల్ గాంధీ మాట్లాడేందుకు టైం ఇవ్వడం లేదంటూ వాపోయారు.
కావాలనే పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. సోనియా గాంధీ దయ వల్ల ఏర్పాటైన రాష్ట్రంలో పార్టీ ఈ రకంగా తయారవుతుందని అనుకోలేదన్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గంప గుత్తగా ..పార్టీ హైకమాండ్‌కు చెప్పకుండానే కారెక్కారు. గులాబీ జెండాలు కప్పుకుని తాము నిజమైన ప్రజా ప్రతినిధులమంటూ ఫోజులిచ్చారు. ఏకంగా సీఎల్పీని తెరాసలో విలీనం చేశారు. రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఆరా తీసినట్టు సమాచారం.
కోదండరెడ్డి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటామన్నది తెలియ చేస్తామని సీనియర్ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురు లేదని, బలమైన పునాదులు ఉన్నాయని మరో నేత మల్లు రవి తెలిపారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని, తిరిగి పవర్ లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకు రావడమే తన ముందున్న లక్ష్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన అన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన స్వంతం. తనకు వాటితో సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద గాంధీ భవన్ లో మాత్రం వేడి మొదలైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి