మ‌హిళాభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు

స‌మాజంలో స‌గభాగం మ‌హిళ‌ల‌దే. వారు లేకుండా ఈ ప్ర‌పంచాన్ని ఊహించుకోలేం. పున‌రుత్ప‌త్తిలో వారే కీల‌కం. కుటుంబం బాగు ప‌డాల‌న్నా..లేదా నాశ‌నం కావాల‌న్నా మ‌హిళ‌లే కీల‌కం. సంపాద‌న ప‌రంగా పురుషుల‌పై భారం వున్న‌ప్ప‌టికీ ఇంటిని చ‌క్క‌దిద్దేది ఆమెనే. ఆ వాస్త‌వం గుర్తిస్తే ఇన్ని ఇబ్బందులంటూ వుండ‌వు. క‌లిసి కాపురం చేసుకుంటే క‌ల‌త‌లు అన్న‌వి మ‌టుమాయ‌మై పోతాయి. అందుకే క‌లిసి వుంటే క‌ల‌దు సుఖం అన్నారు ఎప్పుడో పెద్ద‌లు. సినీ క‌వి అనంద‌మే జీవిత మ‌క‌రందం అని రాయ‌లేదా. గ‌తంలో మ‌హిళ‌లంటే చుల‌క‌న భావం ఉండింది. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌మాజం మార్పున‌కు లోన‌వుతూ వ‌చ్చింది. వారు కూడా మ‌గ‌వారితో అన్ని రంగాల్లో స‌మాన స్థాయిలో పోటీ ప‌డుతున్నారు. దిగ్గ‌జ కంపెనీల‌ను లాభాల బాట‌లో ప‌య‌నించేలా చేస్తున్నారు. ఛైర్మ‌న్లుగా, మేనేజింగ్ డైరెక్ట‌ర్లుగా, డైరెక్ట‌ర్లుగా, వ్యాపార వేత్త‌లుగా, ఐటీ ఎక్స్‌ప‌ర్ట్స్‌గా, ప్ర‌తి రంగంలో త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తూ స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. 

కేవ‌లం మ‌హిళ‌ల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాయి. అపార‌మైన అవ‌కాశాలు , లెక్క‌లేన‌న్ని వ‌న‌రులు ఉన్నాయి. ఒక మ‌హిళ విద్యావంతురాలైతే, త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డితే ఆ కుటుంబ‌మే కాదు ఆ స‌మాజం కూడా బాగుప‌డుతుంది అంటారు ఓ సంద‌ర్భంలో మ‌హాత్మాగాంధీ. ఆంట్ర‌ప్రెన్యూర్స్ గా, అంకుర సంస్థ‌ల‌ను స్తాపించేందుకు, చిరు వ్యాపారాలు నిర్వ‌హించేందుకు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేందుకు ఎన్నో స్కీంలు ఉన్నాయి. కావాల్సింద‌ల్లా వాటిని అర్థం చేసుకుని ఉప‌యోగించు కోవ‌డ‌మే. ఫుడ్, బ్యూటీ, ట్రావెల్, శానిటేష‌న్, ఆటోమొబైల్, ఎంట‌ర్ టైన్ మెంట్, ఇన్నోవేష‌న్, త‌దిత‌ర రంగాల‌లో మ‌హిళ‌ల‌కు ఎక్కువ ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. తాజాగా అగ్రి బిజినెస్‌లో కూడా రాణిస్తున్నారు మ‌హిళామ‌ణులు. వ్య‌వ‌సాయ రంగంలో వారి శాతం అధికంగా వుంటోంది. కూలీలుగా, వ్య‌వ‌సాయ‌దారులుగా, కూర‌గాయ‌లు అమ్మే వారిగా ద‌ర్శ‌న‌మిస్తారు. మ‌గ‌వారి కంటే ఎక్కువ‌గా మ‌హిళ‌ల‌కు త‌ట్టుకునే శ‌క్తిని, అర్థం చేసుకునే మ‌న‌స్త‌త్వాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఈ జాతి వారికి రుణ‌ప‌డి ఉంటోంది. 

మ‌హిళ‌ల కోసం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల్లో ఎనిమిది సంక్షేమ కార్య‌క్ర‌మాలు మ‌రింత పాపుల‌ర్ అయ్యాయి. వాటిని గురించి తెలుసుకుంటే కొంచెమైనా మేలు క‌లుగుతుంద‌ని భావ‌న‌. అన్న‌పూర్ణ ప‌థ‌కం - కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వ‌చ్చింది. ఫుడ్ కేట‌రింగ్ వ్యాపారం నిర్వ‌హించుకునేలా ప్రోత్స‌హిస్తుంది. 50 వేల రూపాయ‌ల దాకా రుణంగా అంద‌జేస్తోంది. వంట పాత్ర‌లు, గ్యాస్ క‌నెక్ష‌న్‌, ఇత‌ర సామాగ్రి కొనుగోలు కోసం ఇది కేటాయించింది. 36 వాయిదాల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వ‌డ్డీ త‌క్కువ‌. కేవ‌లం చిరు వ్యాపారాల కోసం ఉద్ధేశించింది ఈ ప‌థ‌కం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తో పాటు మ‌హిళా బ్యాంకు ఈ స్కీంను అమ‌లు చేస్తున్నాయి. 

ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం మ‌రో ప‌థ‌కం ..స్త్రీ శ‌క్తి ప్యాకేజీ. దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్ర‌డ్యూస్ చేసింది. వ్యాపారంలో 50 శాతం కంటే ఎక్కువ‌గా ఓన‌ర్ షిప్ క‌లిగి వున్న మ‌హిళ‌ల‌కు రుణాలు అంద‌జేస్తారు. ఆంట్ర‌ప్రెన్యూర్ షిప్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం లో స‌భ్యులై శిక్ష‌ణ పొంది ఉండాల‌న్న నిబంధ‌న ఉంది. దీని వ‌ల్ల వ్యాపారం ఎలా నిర్వ‌హించ‌వ‌చ్చో తెలుసు కోవ‌చ్చు. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల దాకా రుణంగా అంద‌జేస్తారు. అతి త‌క్కువ వ‌డ్డీ మాత్ర‌మే వ‌సూలు చేస్తోంది. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి పూచీక‌త్తు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. 

క‌ళ్యాణి ప‌థ‌కం - సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ఇంట్ర‌డ్యూస్ చేసింది. స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు, ఇత‌ర స్త్రీలు ఈ స్కీంలో చేర‌వ‌చ్చు. ఫార్మింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్ మేకింగ్, బ్యూటీ, క్యాంటీన్, మొబైల్ రెస్టారెంట్స్, స‌ర్క్యూలేటింగ్ లైబ్ర‌రీస్, ఎస్టీడీ, జిరాక్స్ బూత్‌లు, టైల‌రింగ్ , త‌దిత‌ర వాటికి రుణంగా ఇస్తారు. ఈ ప‌థ‌కం కింద కోటి రూపాయ‌ల దాకా రుణం అంద‌జేస్తారు. మార్జిన్ మ‌నీ కింద 20 శాతం ల‌బ్దిదారులు పెట్టుబ‌డిగా పెట్టాల్సి ఉంటుంది. కొలెట‌రల్ సెక్యూరిటీతో పాటు గ్యారెంట‌ర్స్ కూడా అవ‌స‌రం. 7 ఏళ్ల కాల ప‌రిమితిలో తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చేయాలి. లేక‌పోతే వ‌డ్డీ పెరిగి పోతుంది. త‌క్కువ వ‌డ్డీకి ఇంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు రావు. 

ముద్ర‌తో ఆస‌రా. న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక ప్ర‌వేశ పెట్టిన మంచి ప‌థ‌కమే ముద్ర‌. చిరు వ్యాపారుల‌కు 50 వేల నుంచి 10 ల‌క్ష‌ల దాకా రుణంగా ఇస్తారు. ఎలాంటి సెక్యూరిటీ అవ‌స‌రం లేదు. వేలాది మంది ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందారు. మ‌హిళ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీ ఉంటుంది. ప్ర‌తి బ్యాంకు దీనిని అమ‌లు చేయాల్సిందే. లేక‌పోతే ఆర్బీఐ , స‌ర్కార్ కొర‌డా ఝులిపిస్తుంది. శిశు, కిషోర్, త‌రుణ్ అనే విభాగాలుగా రుణాలు మంజూరు చేస్తాయి. మ‌రో స్కీం..మ‌హిళా ఉద్య‌మ్ నిధి స్కీం. దీనిని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ఇంట్ర‌డ్యూస్ చేసింది. సిడ్బీ కూడా అమ‌లు చేస్తోంది. మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల కోసం ఇది ప‌నిచేస్తుంది. 10 ఏళ్లలో 10 ల‌క్ష‌ల రూపాయ‌లు తీర్చాల్సి ఉంటుంది. సిడ్బీ మాత్రం 5 ఏళ్ల‌లో తీర్చాల్సి ఉంటుంది. కేర్ సెంట‌ర్లు, ఆటో రిక్షాలు, టూ వీల‌ర్స్, కార్స్ త‌దిత‌ర వాటి కోసం రుణాలు ఇస్తోంది. 
 
దేనా శ‌క్తి స్కీం - దేనా బ్యాంకు దీనిని అమ‌లు చేస్తోంది. 20 ల‌క్ష‌ల దాకా రుణంగా ఇస్తోంది. వ్య‌వ‌సాయం, మాన్యూఫాక్ష‌రింగ్, మైక్రో క్రెడిట్, రెంట‌ల్ స్టోర్స్, స్మాల్ ఎంట‌ర్ ప్రైజెస్ వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. 20పైస‌లు మాత్ర‌మే వ‌డ్డీ. 50 వేల నుంచి 20 ల‌క్ష‌ల దాకా ఇస్తారు. మ‌హిళా వికాస్ యోజ‌న ప‌థ‌కం దీనిని ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ బ్యాంకు అమ‌లు చేస్తోంది. ప్రాప‌ర్టీ మీద ఇస్తారు. 10 ల‌క్ష‌ల నుంచి 25 ల‌క్ష‌ల దాకా స్మాల్ స్కేల్ ఇండ‌స్ట్రీ ఏర్పాటు కోసం దీనిని వెచ్చిస్తారు. భార‌తీయ మ‌హిళా బ్యాంక్ బిజినెస్ లోన్స్ - బీఎంబీ బ్యాంకు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం ఇది. ఈ బ్యాంకు ఎస్‌బిఐలో విలీనం అయింది. 2013లో కేవ‌లం మ‌హిళ‌ల కోస‌మే దీనిని ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత మెర్జ్ చేశారు. 20 కోట్ల దాకా రుణంగా ఇస్తారు. త‌క్కువ వ‌డ్డీ, ఎక్కువ వాయిదాల సౌల‌భ్యం ఉంది ఇందులో. ఇంకా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయి. వాటిని కూలంకుశంగా అర్థం చేసుకుని రుణం పొందితే మీ కాళ్ల మీద నిల‌బ‌డొచ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!