క‌థ కంచికి..చెన్నై ఇంటికి ..ఐపీఎల్ ఫైన‌ల్లో ముంబ‌యి


నిన్న‌టి దాకా ఐపీఎల్ -12 టోర్న‌మెంట్‌లో హాట్ ఫెవ‌రేట్‌గా ఉన్న ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ముంబ‌యి ఇండియ‌న్స్ . ఈ టోర్నీలో అటు బౌలింగ్‌లోను ఇటు బ్యాటింగ్‌లోను ..అన్ని ఫార్మాట్‌ల‌లో రాణిస్తూ అప్ర‌హ‌తిహ‌తంగా విజ‌యాలు సాధిస్తూ రికార్డులు బ్రేక్ చేసిన చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ముంబ‌యి. అనూహ్యంగా ఈ జ‌ట్టు చెన్నైకి చుక్క‌లు చూపించింది. చెన్నైలోని స్వంత గ‌డ్డ‌పై చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ ఆద్యంత‌మూ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్. ఐపీఎల్ 12వ సీజ‌న్ తొలి క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ సంద‌ర్భంగా ముంబయి ఇండియ‌న్స్ చెన్నైపై ఘ‌న విజ‌యం సాధించింది. అభిమానుల ఆశ‌ల‌ను నీరు గారుస్తూ అన్ని రంగాల‌లో రాణించిన ముంబ‌యి అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. ఫైన‌ల్‌కు చేరింది.

గెలుపే ల‌క్ష్యంగా ముంబ‌యి ప‌ట్టుద‌ల‌తో ఆడింది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి 131 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబ‌యి జ‌ట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 131 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. గోడ‌లా నిల‌బ‌డ్డాడు. 54 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లతో 71 ప‌రుగులు చేశాడు. యాద‌వ్‌కు తోడుగా ఇషాన్ కిష‌న్ 31 బంతులు ఎదుర్కొని ఒక భారీ సిక్స్‌తో 28 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రూ మ‌రో వికెట్ కోల్పోకుండా మూడో వికెట్ కు 80 ప‌రుగులు జోడించారు. చెన్నై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. జ‌ట్టు స్కోరు 101 ప‌రుగుల వ‌ద్ద ..ఇమ్రాన్ తాహిర్ వ‌రుస బంతుల్లో ఇషాన్, కృనాల్ పాండ్య‌ల‌ను అవుట్ చేశాడు.

ఆఖ‌రులో బ్యాటింగ్‌కు వ‌చ్చిన పాండ్య 11 బంతులు ఆడి ఒక ఫోర్ సాయంతో 13 ప‌రుగులు చేయ‌గా..సూర్య‌కుమార్ నిల‌క‌డ‌గా ఆడుతూ విజ‌య తీరాల‌కు చేర్చారు. చెన్నై జ‌ట్టులో తాహిర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా దీప‌క్, హ‌ర్బ‌జ‌న్ చెరో వికెట్ తీశారు.
అంత‌కు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 131 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అంబ‌టి రాయుడు 27 బంతులు ఆడి మూడు ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 42 ప‌రుగులు చేయ‌గా..కెప్టెన్ ధోనీ 29 బంతులు ఆడి మూడు భారీ సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేశారు. వీరిద్ద‌రూ క‌లిసి 60 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. మొద‌ట 32 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ముర‌ళీ విజ‌య్ , రాయుడు ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

12వ ఓవ‌ర్‌లో విజ‌య్ అవుట్ కాగా ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ధోనీ జ‌ట్టును 130 ప‌రుగులు దాటించారు. హాట్ ఫెవ‌రేట్‌గా ఉన్న చెన్నై జ‌ట్టు అనూహ్యంగా ముంబై జ‌ట్టు చేతిలో ఓట‌మి పాల‌వ‌డాన్ని ధోనీతో స‌హా చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. ఈ జ‌ట్టు మీదే ఎక్కువ‌గా బెట్టింగ్‌లు జ‌రిగాయి. కోట్లాది రూపాయ‌ల‌ను కోల్పోయారు. ముంబ‌యి జ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో చెన్నై ప‌రుగులు భారీగా చేయ‌లేక పోయింది. క్రీజులో ధోనీ ఉన్నా స్కోరు మంద‌కొడిగా సాగింది. ఎట్ట‌కేల‌కు ముంబ‌యి ఫైన‌ల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

కామెంట్‌లు