పంతుళ్లు గరం గరం..ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు ఇపుడు రోడ్డెక్కారు. తమ పవర్ ఏమిటో..తమ ప్రతాపం ఏమిటో త్వరలోనే తేలుస్తామంటూ ఆందోళన బాట పట్టారు తెలంగాణలో. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగి పోయిందని..దాంతో పాటే ఇక విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి దాకా ఆందోళనలు, నిరసనలు, పెన్ డౌన్లు చేపట్టిన రెవిన్యూ శాఖ ఉద్యోగులు ఇపుడు మిన్నకుండి పోయారు. ఏదైనా సరే సంతకం కావాలన్నా..పేరు మార్చాలన్నా..పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా..జనన. మరణ పత్రాలు జారీ చేయాలన్నా చేతులు తడపాల్సిందే. ఈ విషయం అంతర్గత సర్వేలో కూడా నిజమని తేలడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు. రెవిన్యూ శాఖలో మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తామంటూ ప్రకటించారు. ఓ రైతు చేసిన ఫిర్యాదుపై సీఎం తీవ్రంగా స్పందించారు.
వేలాది రూపాయలు జీతాలు ఇస్తున్నా ఎందుకు అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. దీంతో సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని రెవిన్యూ ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా సీఎం తగ్గలేదు. ఒక్కసారి కమిట్ అయ్యాక ..వెనక్క తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు.
టీచర్లు పాఠాలు చెప్పడం లేదు. చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెట్టారు. ప్లాట్లు, ఫ్లాట్స్ , ఇండ్లు అమ్ముతున్నారు. ఇంక ఏం పాఠాలు చెబుతారంటూ ..విద్యా శాఖను ప్రక్షాళన చేస్తానంటూ వెల్లడించారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లందరు ఉలిక్కి పడ్డారు. తమ పునాదులు కదులుతాయోమేనని భయపడ్డారు. అంతా ఒక్కటయ్యారు. సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెలో ఇన్ని సంఘాలు ఉన్నాయని ఎందుకు అనలేదంటూ ప్రశ్నించారు.
తాము పాఠాలు చెప్పడమే కాదు గుణపాఠాలు కూడా నేర్పగలమని హెచ్చరించారు. ఏపీలో కంటే ఎక్కువగా టీచర్లకు వేతనాలు ఇస్తున్నామని ఎందుకని ఫలితాలు రావడం లేదంటూ సీఎం ప్రశ్నించారు. దీనిని కూడా టీచర్లు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఇలా మాట్లాడడం ఆయనకు మంచిది కాదంటూ హితవు పలికారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు రోడ్డెక్కారు. ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన సీఎం మాట మార్చారని, టీచర్ల సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ దగ్గర టీచర్లు ధర్నా చేపట్టారు.
ఏకీకృత సర్వీస్ రూల్స్ ఆధారంగా టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలని, 40 శాతం ఐఆర్, నూతన పీఆర్సీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈ ఆందోళన బాట పట్టాయి. తమను సీఎం తక్కువ అంచనా వేశారని..తామేమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యల దెబ్బకు టీచర్లు రోడ్డెక్కడంతో ..స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రెవిన్యూ శాఖ ..ఇంకో వైపు విద్యా శాఖల ఉద్యోగులు , టీచర్లు ప్రభుత్వ తీరుతో సందిగ్ధంలో పడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి