మార్పు సాధ్యమే..మౌనం వీడిన పవర్ స్టార్
ఎట్టకేలకు జనసేన పార్టీ అధినేత..పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ మౌనం వీడారు. మార్పు అన్నది ఒక్కసారిగా జరగదని..అది మెల మెల్లగా ప్రారంభమవుతుందని..ఆ విషయంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో తేటతెల్లమైందని చెప్పారు. ఎన్నికలకంటే ముందే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమావేశాల్లో , రోడ్ షోలలో పవన్ పాల్గొన్నారు. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని..పవర్‌లోకి రావాలని ..అప్పుడే కేబినెట్‌ను రూపొందించుకుంటున్న వైసీపీని ఆయన టార్గెట్ చేశారు. ఎన్నడూ లేనంతగా అవినీతి, అక్రమాలు బాబు పాలనలో చోటు చేసుకున్నాయని..తక్కువ ధరకే పేదల నుండి భూములు లాక్కున్నారని ..మార్కెట్ ధర చెల్లించలేదంటూ ధ్వజమెత్తారు. తాను ఎవ్వరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడనని..కానీ తనను లక్ష్యంగా చేస్తూ కామెంట్స్ చేస్తే ఊరుకోనని..తాట తీస్తానంటూ పవర్ స్టార్ జగన్‌ను ఉద్ధేశించి పరోక్షంగా హెచ్చరించారు.
యువతీ యువకులు చైతన్యవంతం కావాలని..సమస్యలు పరిష్కారమయ్యేంత దాకా జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు నిద్ర పోరాదంటూ ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ విస్తృతంగా పవన్ పర్యటించారు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. మరో వైపు ఎంపీ సీట్లకు కూడా సెలెక్ట్ చేశారు. బహుజన సమాజ్‌వాది పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలతో స్నేహ ధర్మం పాటించారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో బీఎస్పీతో కలిసి భారీ సభను నిర్వహించారు. దేశ ప్రధాని అయ్యేందుకు కుమారి మాయావతికి అర్హత ఉందంటూ ప్రకటించారు. ఆమె పీఎం కావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత జగన్ బాబును టార్గెట్ చేస్తూ రోజూ వార్తల్లో వుంటే ..పవన్ కళ్యాణ్ మాత్రం మిన్నకుండి పోయారు.
ఎక్కడా కనిపించలేదు..మాట్లాడలేదు. ఎన్నికల సరళి గురించి వ్యాఖ్యానించలేదు. ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటూ అభిమానులు చర్చించుకున్నారు. నిన్న గుంటూరులో మీడియాతో ముచ్చటించారు పవన్. తాము ఆశించిన మార్పు ప్రజల్లో మొదలైందని..అది ఫలితాల్లో కనిపిస్తుందని స్పష్టం చేశారు పవర్ స్టార్. అసెంబ్లీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం నేతలకు దిశా నిర్దేశనం చేశారు. ఎన్నికలు ముఖ్యం కాదని..ఫలితాలు వెలువడ్డాక కూడా పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. మార్పు సహజం. చరిత్ర కూడా మార్పునకు లోనవుతూనేఉంటుంది. తాను ఆశించిన మార్పు చిన్నగా మొదలైందని చెప్పారు. గ్రామ స్థాయి నుండి కొత్త తరం నేతలను తయారు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించాలని..అందుకు కష్టపడాలన్నారు.
తెలంగాణలోను ఇదే తరహా మార్పును ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించి ప్రజలను కలవాలని సూచించారు. సమస్య పెద్దదైతే తాను స్పందిస్తానని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలన్నారు. గ్రామస్థాయిలో సమస్యల పట్టిక తయారు చేయాలన్నారు. భయం, అభద్రతను దాటుకుని వచ్చిన యువత తమ వద్ద ఉందన్నారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నాయని..వారికి ధీటుగా కొత్త నాయకత్వం రావాలని పవన్ కోరారు. ఫలితాలు..గెలుపు ఓటములు సహజం..అది కాదు కావాల్సింది..సమస్యలు పరిష్కారమే జనసేన అంతిమ లక్ష్యం ..దాని కోసం పాటుపడాలని కోరడం ..మార్పునకు శ్రీకారం చుట్టినట్టే. ఈ దిశగా కృషి చేస్తే ..ఇవ్వాళ కాక పోయినా..రేపు జనసేనదవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి