ఏపీ పీఠం ఎవ్వ‌రిదో - యుద్ధ రంగాన్ని త‌ల‌పిస్తున్న ప్ర‌చారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం యుద్ధాన్ని త‌లపింప చేస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. స‌వాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ల‌తో చుట్టి వ‌స్తే..జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోడ్ షోలు ..స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని..ప‌వ‌ర్‌లోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న వైసీపీని ..బాబు, జ‌గ‌న్‌ల‌ను టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న వారు వైసీపీలోకు జంప్ అవ‌గా..వైసీపీలో ఉన్న మ‌రికొంద‌రు ప‌సుపు కండువా కప్పుకుంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఫ‌రూక్ అబ్దుల్లా, అర‌వింద్ కేజ్రీవాల్, మాయావ‌తి, మ‌మ‌తా బెన‌ర్జీలు చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా ఏపీలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేశారు.

దేశాన్ని వందేళ్లు వెన‌క్కి తీసుకు వెళుతున్నారని, ప్ర‌భుత్వ రంగంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని..త‌న‌ను వ్య‌తిరేకించే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. కేజ్రీవాల్ నిన్న‌టి ఛాయ్ వాలా నేడు చౌకీ దార్ గా ఎలా మారాడ‌ని ఎద్దేవా చేశారు. జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీ అడ్ర‌స్ లేకుండా పోతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. వీరంద‌రి ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టేందుకు టీడీపీ, వైసీపీ ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఎన్నిక‌లు జ‌రిగేందుకు కొద్ది స‌మ‌యం మాత్రమే ఉండ‌డంతో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాల‌ని తెలుగుదేశం తీవ్రంగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు రోడ్ షోలు, స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల విజ‌యానికి జ‌నాన్ని జాగృతం చేస్తున్నారు.

ఇంకో వైపు బాబును టార్గెట్ చేసిన పీఎం మోడీ..అమిత్ షా ద్వ‌యం బాబు అనుచ‌రులు, టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్న నేత‌ల‌పై ఐటీ దాడులు జ‌రుప‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. దీనిని ఎంత వ‌ర‌కైనా ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని బాబు స్ప‌ష్టం చేశారు. ఎవ్వ‌రికీ భ‌య‌పడేది లేద‌ని..కేసీఆర్‌, మోడీ, జ‌గ‌న్‌లు ఒక్క‌టైనా త‌న‌ను ఏమీ చేయ‌లేర‌ని స‌వాల్ విసురుతున్నారు. లెక్క‌లేన‌న్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని, రాజ‌ధానిని అభివృద్ధి చేయ‌డం, ఐటీ కారిడార్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం, విశాఖ‌ను ఐటీ హ‌బ్‌గా తీర్చిదిద్ద‌డం, యువ‌త‌కు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ లో శిక్ష‌ణ ఇవ్వ‌డం, ఐటీ కంపెనీలు, ఇత‌ర కంపెనీలు ఏపీలో ప్రారంభించేలా వారితో ఒప్పందాలు చేసుకోవ‌డం, మౌళిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం చేశామ‌ని చెబుతున్నారు. జ‌న‌సేన అధినేత జ‌గ‌న్ ..మాయావ‌తి ఆధ్వ‌ర్యంలోని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఇరు పార్టీల ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో భారీ స‌భ‌ను నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా బెహ‌న్ జీ కేసీఆర్‌పై ఆయ‌న కుటుంబంపై, పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ద‌ళితుల‌కు, బ‌హుజ‌నుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని..ఏ పాల‌కులు చేయ‌నంత మోసానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను వ‌మ్ము చేశార‌ని, ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ...మాట త‌ప్పార‌ని ధ్వ‌జమెత్తారు. 75 శాతానికి పైగా ఉన్న బ‌హుజ‌నుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని..రాబోయే కాలంలో టీఆర్ ఎస్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌రాన్ని పెంచారు. తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. జ‌గ‌న్‌ను వెన‌కేసుకు రావ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఉద్య‌మ స‌మ‌యంలో మిమ్మ‌ల్ని తిట్టిన వారే మీ ప‌క్క‌నున్నార‌ని గుర్తు చేశారు. రెండు శాతం లేని వాళ్ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో రెండు నాల్క‌ల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్దంటూ కోరారు. ప్ర‌తిప‌క్షాలు లేకుండా పాల‌న సాగించాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి దేశ ప్ర‌ధాని అవుతుంద‌ని జోష్యం చెప్పారు.

కేవ‌లం అధికారం కోసం జ‌నాన్ని మ‌భ్య పెట్టేందుకు నేత‌లు వ‌స్తున్నార‌ని వారిని గ‌మ‌నించి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం తానే సీఎంను అవుతాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. మొత్తానికి మొత్తం సీట్లు గెలుస్తామ‌ని..త‌మ‌కు అన్ని పార్టీల మ‌ద్థ‌తు ల‌భిస్తోంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర ఫ‌లాలు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అందాల‌ని ఆకాంక్షించారు. ప‌రిపాల‌నా ప‌ర‌మైన అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతారా..విప‌రీత‌మైన ఫ్యాన్ పాలోయింగ్ క‌లిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపిస్తారా..పాద‌యాత్ర‌ల‌తో జ‌నానికి ద‌గ్గ‌రైన జ‌గ‌న్ పీఠాన్ని అధిష్టిస్తారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కామెంట్‌లు