సివిల్స్‌లో మెరిసిన మట్టి బిడ్డలు - సత్తా చాటిన పల్లె పరిమళాలు - సివిల్స్ ట్రైనింగ్ హబ్‌గా హైదరాబాద్
దేశంలో అత్యుత్తమమైన సర్వీసుగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పేదింటి బిడ్డలు తమ సత్తా చాటారు. తెలుగు వారు మరోసారి మెరిశారు. జాతీయ స్థాయిలో యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి ఏకంగా ఏడవ ర్యాంకు సాధించి ఆశ్చర్యపోయేలా చేశాడు. టాప్ పరంగా 100 ర్యాంకులను ప్రకటిస్తే అందులో తెలుగు వారు ఆరు మంది ఉండడం విశేషం. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వారే తమ సత్తా ఏమిటో ప్రదర్శించారు. సివిల్ సర్వీసెస్ లో అత్యుత్తమమైన ఫలితాలు ఇక్కడి వారే పొందుతున్నారు.
సివిల్స్ కోచింగ్ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ మారింది. 2018లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్ లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు చేపట్టింది. ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించింది. మొత్తంగా చూస్తే 759 మంది ఈ సర్వీసుకు ఎంపిక చేసింది యుపీఎస్సీ. జనరల్ కేటగిరిలో 361 మంది, ఓబీసీ కేటగిరిలో 209 మంది, ఎస్సీ కేటగిరిలో 128 మంది, ఎస్టీ కేటగిరిలో 61 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మెరిసారు. వరుణ్ రెడ్డి 2016లో సివిల్స్‌లో 166 వ ర్యాంకు సాధించి ఐఆర్ ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న వారికే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ షాహిద్ 57వ ర్యాంకు సాధించగా, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన ప్రవీణ్ చంద్ 64 ర్యాంకు పొందారు.
తిరుపతికి చెందిన నవీన్ 75వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్న చాలా మంది ఈ ఫలితాల్లో సత్తా చాటారు. దక్షిణ భారత దేశంలో అత్యున్నత ర్యాంకులు పొందిన వారంతా తెలుగు వారే. ఆర్‌సి రెడ్డి, ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడెమీ ఇనిస్టిట్యూట్‌లలో చదివిన వారు ర్యాంకులు పొందారు. ఢిల్లీకి ధీటుగా హైదరాబాద్ సివిల్స్ హబ్‌గా పేరొందింది. గతేడాది ఫలితాల్లో తెలంగాణ స్టూడెంట్‌కు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇదే విధంగా మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి తల్లి ఏడీఏగా పనిచేస్తుండగా తండ్రి కర్ణాటి జనార్దన్ రెడ్డి కంటి డాక్టర్‌గా ఉన్నారు. ఐఆర్ ఎస్ వచ్చినా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పట్టుదల మరింత పెరిగింది. వస్తుందన్న నమ్మకం నాకుంది. అదే నిజమైందని స్పష్టం చేశారు ఈ తెలంగాణ కుర్రాడు వరుణ్ రెడ్డి.
కడప జిల్లా రాయచోటికి చెందిన రాఘవేంద్ర నాన్న డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 180వ ర్యాంకు పొందారు. వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన రైతు బిడ్డ చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి సివిల్స్‌లో 131వ ర్యాంకు సాధించారు. కూతురు శ్రీజ గ్రూపు -2 కు ఎంపికైంది. ఐపీఎస్ కావాలనుకుని ఐఏఎస్ కు ఎంపికయ్యాడు ఈ పేదింటి బిడ్డ. సూర్యపేటకు చెందిన మల్లు చంద్రకాంత్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 208వ ర్యాంకు పొందాడు. చీకటిని ఛేదించి వెలుగులోకి..ఆదిలాబాద్ జిల్లా వాసి సుశంతన్ రెడ్డి అంధుడు. కష్టపడి చదివి సివిల్స్‌కు ఎంపికయ్యాడు. 742వ ర్యాంకు సాధించాడు. ఆపిల్‌లో నెలకు 5 లక్షల వేతనం వదులుకున్న శ్రీకర్ కల సివిల్స్. 570వ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు.
ఆయనతో పాటు అంకిత చౌదరి, లక్ష్మి, షాహిద్, ప్రవీణ్ , మోహన్, దిలీప్ కుమార్, మహేశ్వర్ రెడ్డి, శ్రీపాల్, రాఘవేంద్ర, చంద్రకాంత్ రెడ్డి, కిషోర్, అనూష, మురళి, ధీరజ్, లాల్, రాఘవ్, శశికాంత్, వెంకటేశ్‌తో పాటు మరికొందరు సత్తా చాటారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. మొత్తం మీద అసాధ్యం అనుకున్న సివిల్స్ సర్వీసెస్ ..అస్పిరెంట్స్ అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఇప్పటికే ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తున్న ఈ నగరం అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా అద్భుతాలు సాధించేలా మెరికలను తయారు చేస్తోంది ఈ నగరం. ఇదంతా కేసీఆర్ చలవే అనుకోవాలా..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి