బోల్తా ప‌డిన బెంగ‌ళూరు..రాజ‌స్థాన్ రాయ‌ల్ విక్ట‌రీ

సమ‌య స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తే..క‌లిసి క‌ట్టుగా పోరాడితే..ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు తీసుకుంటే అద్భుత‌మైన విజ‌యాల‌ను చేజిక్కించుకోవ‌చ్చు అనేది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు చేసి చూపించింది. ఇలాంటి అరుదైన స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తాయి. ఐపీఎల్ టోర్నీలో అనుకోని గెలుపులు ఆయా జ‌ట్ల‌ను వ‌రిస్తున్నాయి. క‌ళ్లు చెదిరే షాట్లు..దిమ్మ తిరిగే వికెట్లు..ఫీల్డింగ్‌లో ఊహించ‌ని చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వేలం పాట‌ల్లో కోట్లు పోసి చేజిక్కించుకున్న ఆట‌గాళ్లు కొంద‌రు రాణిస్తే మ‌రికొంద‌రు నిరాశ ప‌రిచారు. ఇంకా జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లు చాలా వున్నాయి. ఎవ‌రు టాప్ ఫైవ్‌లోకి వ‌స్తార‌నేది అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తోంది.

ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను అందించిన కెప్టెన్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విరాట్ కొహ్లి ఈ టోర్నీలో ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచారు. ఆయ‌న లీడ్ చేస్తున్న బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు వ‌రుస‌గా ఈ టోర్నీలో నాలుగో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఇది మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అస‌లు అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో అజింక్యా ర‌హానే నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు గెలుస్తూ వ‌స్తోంది. బెంగ‌ళూరు జ‌ట్టు తీరు మార‌లేదు. సేమ్ సీన్. బంతితో పోరాటం సాగించినా ..బ్యాటింగ్‌లో మాత్రం త‌డ‌బాటుకు లోన‌వుతోంది. క్రికెట్ స్టార్స్ కోహ్లి, డివిలియ‌ర్స్ మ‌రోసారి పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు.

శ్రేయ‌స్ గోపాల్ అద్భుత‌మైన బౌలింగ్, జోస్ బ‌ట్ల‌ర్ ల ప్ర‌తిభ తోడ‌వ్వ‌డంతో బెంగ‌ళూరు ఓట‌మి పాలైంది. ఐపీల్ -12లో తొలి బోణీ కొట్టింది రాజ‌స్థాన్ జ‌ట్టు. నాలుగు మ్యాచ్‌లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. ఏడు వికెట్ల తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ను ఓడించింది. కేవ‌లం 12 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గెలుపులో కీల‌క భూమిక పోషించిన శ్రేయ‌స్ గోపాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగులు చేసింది. పార్థివ్ ప‌టేల్ 67 , బ‌ట్ల‌ర్ 59, స్టీవెన్ స్మిత్ 38 ప‌రుగులు చేయ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు సునాయ‌సంగా విజ‌యం సాధించింది. ర‌హానే 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

రాహుల్ త్రిపాఠితో క‌లిసి స్టీవెన్ స్మిత్ జ‌ట్టును ల‌క్ష్యం దిశ‌గా న‌డిపించాడు. టాస్ ఓడిన కోహ్లి మొద‌ట బ్యాటింగ్ కు దిగాడు. ఓపెన‌ర్ పార్థివ్ ధాటిగా ఆడినా మిగ‌తా ఆట‌గాళ్లు రాజ‌స్థాన్ బౌలర్ల ధాటికి త‌ట్టుకోలేక పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. శ్రేయ‌స్ గోపాల్ అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించ‌డం..జ‌ట్టు ఒక్క‌టిగా ఆడ‌డంతో విజ‌యం సునాయ‌స‌మైంది. ఏది ఏమైనా ఈ టోర్నీలో ఏ జ‌ట్టు ఎప్పుడు మెరుస్తుందో..ఇంకెప్పుడు ఓట‌మి మూట‌గట్టుకుంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. న‌రాలు తెగే ఉత్కంఠ‌ను మాత్రం క్రికెట్ అభిమానులు అనుభ‌విస్తున్నారు. 19.5 ఓవ‌ర్ల‌లో 164 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది. ఆఖ‌రు వ‌ర‌కు క‌ట్ట‌డి చేద్దామ‌నుకుని అనుకున్న కోహ్లి టీంకు అనుకోని రీతిలో రాజ‌స్థాన్ ఆట‌గాళ్లు షాక్ ఇచ్చారు.

కామెంట్‌లు