బ్యాంకుల విలీనం సరే..డిఫాల్టర్ల సంగతేంటి..?
దేశంలో అతి పెద్ద రంగ బ్యాంకింగ్ సంస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. విజయా , దేనా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కావడంతో మరో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా మారింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ దేశానికి ..అన్ని బ్యాంకులకు కస్టోడియన్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. కోట్లాది రూపాయలు జమ చేయడం, లావాదేవీల నిర్వహణ..ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..ఆర్థిక నేరాలు సంభవించకుండా చూడటం..కస్టమర్లు లేదా ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆర్బీఐ కఠినతరమైన నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది. వ్యాపార, వాణిజ్య అవసరాలే కాకుండా వ్యాపారాలు చేపట్టేందుకు , పరిశ్రమలు స్థాపించేందుకు బ్యాంకులు చేదోడు వాదోడుగా ఉన్నాయి.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థపై కోట్లాది మంది ప్రజలు అపారమైన నమ్మకం కలిగి ఉన్నారు. దేశ వ్యాప్తంగా వేలాది శాఖలను కలిగి ఉన్నాయి. ఇతోధికంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి. అత్యధికంగా ప్రభుత్వ శాఖల లావాదేవీలన్నీ ..వ్యవహారాలన్నీ ఎస్‌బిఐ ద్వారా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు వడ్డీ రూపేణా పొందుతున్నాయి. జమ చేసిన డబ్బులతో వచ్చిన వడ్డీతోనే సిబ్బందికి జీతభత్యాలు, బ్యాంకుల స్థాపన, ఇతర ఖర్చులన్నీ సమకూర్చుతున్నాయి. నాబార్డ్ వ్యవసాయ రుణాలను అందజేస్తోంది. రైతులకు నేరుగా రుణాలు అందజేయడం, ఎలాంటి పూచీ కత్తు లేకుండా మంజూరు చేయడం, వ్యవసాయ సాగుకు, పండ్లు, తోటల పెంపకం, బిందు సేద్యం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు భరోసా ఇవ్వడమే కాదు కోట్లాది రూపాయలు తక్కువ వడ్డీకే అందజేస్తోంది. అంతేకాకుండా ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకులకు స్పష్టంగా ప్రణాళికను రూపొందిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంకు, కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐసీసీఐ, హెచ్‌డిఎఫ్‌సీ తదితర ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులన్నీ ఆర్బీఐ పరిధిలో పనిచేస్తున్నాయి. మిగతా ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే. ఎస్బీఐ కోట్లాది రూపాయలను కలిగి ఉన్నది. లెక్కలేనన్ని ఆస్తులు, వేలాది మంది సిబ్బంది, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఆప్ ల ద్వారా నిమిషాల్లోనే డబ్బులను మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో పాటు ముందస్తుగా చెక్కులు, డీడీలు, కరెంట్ , వ్యక్తిగత , ఉమ్మడి ఖాతాలను అందజేస్తోంది. సంపాదించిన డబ్బులకు భరోసా ఇచ్చేలా ఎఫ్‌డీలు, పీపీఎఫ్, ఆర్డీ స్కీంలు నెల నుండి 3 ఏళ్లు ..10 ఏళ్ల వరకు ఎఫ్డీలకు అధిక వడ్డీ రేటు అందజేస్తున్నాయి. దేశమంతటా ఆర్బీఐ పరిధిలోనే ఈ బ్యాంకులన్నీ పని చేస్తున్నాయి.
ప్రత్యేకించి మహిళల కోసం మహిళా బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇటీవల దానిని కూడా విలీనం చేశారు. ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంచి శాఖల ద్వారా సేవలందిస్తున్నారు. ఎంతో పారదర్శకతను ..గోప్యతను పాటించాల్సిన బ్యాంకులు ఖాతాదారుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయి. ఇది అనాది నుండి నేటి దాకా జరుగుతూనే ఉన్నది. కేవలం ఒకే ఒక్క రూపాయి చొప్పున ప్రతి భారతీయుడు జమ చేస్తే చాలు 110 కోట్లు ఒకే సారి జమ అవుతాయి. స్వయం సహాయక గ్రూపుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ఉద్యోగులకు ఠంఛనుగా జీతాలు చెల్లించడమే కాదు పెన్షన్లర్లకు సైతం బ్యాంకులు, పోస్టాఫీసులు సేవలందిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రంగ సంస్థగా పేరొందిన పోస్టాఫీసులు ఇపుడు బ్యాంకులుగా మారాయి. ఏ బ్యాంకు ఖాతాదారులైనా పోస్టాఫీసుల బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు..జమ చేయొచ్చు. దేశంలో అత్యంత నమ్మకమైన రంగంగా బ్యాంకింగ్ వ్యవస్థకు పేరుండేది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఇంటి దొంగలు ఆర్థిక నేరాలు జరిగేందుకు దోహద పడ్డారు.
ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బులను హవాలా ద్వారా ఇతర దేశాల్లో జమ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బులను కొందరు బడా బాబులు, వ్యాపారవేత్తలు లాలూచీ పడి కాసులు కొల్లగొడుతున్నారు. ఇప్పటికీ ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రుణాలు తీసుకుని చెల్లించలేని ఖాతాదారులు, రైతులపై కేసులు నమోదు చేయించే బ్యాంకులు ..తమకు శఠగోపం పెట్టిన వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రధాని అయ్యాక. బ్లాక్ మనీని తీసుకు వస్తానని మాటిచ్చాడు. ఏకంగా ఆర్బీఐ గవర్నర్ కు తెలియకుండానే నోట్లను రద్దు చేశాడు. జీఎస్టీ తీసుకు వచ్చారు. దీంతో కోట్లాది ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్యాంకులన్నీ కుప్ప కూలాయి. నోట్ల రద్దు దెబ్బకు జనాన్ని పిచ్చి వాళ్లను చేశాయి. దాచుకున్న సొమ్మును తిరిగి తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారుల పట్ల వివక్ష చూపించాయి. వివిధ పేర్లతో..వివిధ ప్రాంతాలలో ఏర్పాటైన బ్యాంకులన్నీ ఏకమై ఒకే బ్యాంకింగ్ గొడుగు కిందకు వచ్చినా ఒనగూరే లాభం ఏమీ లేదు.
దీని వల్ల ఖాతాదారులకు వడ్డీ పెరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది. బ్యాంకులు డబ్బులు లేక కునారిల్లి పోయే పరిస్థితికి దిగజారాయి. ఖాతాదారులు తమ డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. సంపాదించిన వాటినన్నింటిని పొలాలు, ప్లాట్లు, ఇండ్లు, బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఈ దేశాన్ని కాపాడటం లేదు..కోట్లాది పేదలు దాచుకున్న డబ్బులే ఇవాళ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇకనైనా ఆర్బీఐ మరింత కఠినతరమైన నిబంధనలు విధించాలి. ఖాతాదారులకు భరోసా కల్పిస్తూ..ఆర్థిక భద్రతను కలిపించే దిశగా అడుగులు వేస్తేనే బ్యాంకులు గాడిన పడతాయి. రెపో రేటు పెంచడం, జనాన్ని తమ డబ్బులను జమ చేసుకునే వీలుగా చైతన్యవంతం చేయడం, అత్యధిక వడ్డీని ఇవ్వడం, ఎలాంటి పన్ను లేకుండా నెల నెలా ఆదాయం వచ్చేలా పీఎఫ్, ఆర్డీలను మార్చ గలిగితే కొంత మేరకు బ్యాంకులు బతికి బట్ట కడతాయి. లేక పోతే బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమాదంలో పడనుంది. వాచ్ డాగ్ గా ఉండాల్సిన ఆర్బీఐ మరింత దూకుడు పెంచాలి. కస్టమర్లే దేవుళ్లు అనే నానుడిని నిజం చేయాలి. మోడీ వచ్చినా లేక రాహుల్ పగ్గాలు చేపట్టినా..కేసీఆర్ అనుకోకుండా ప్రధాని అయినా ఒరిగేది ఏమీ ఉండదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి