సంక్షేమ పథకాల జపం..ఉద్యోగాల ఊసెత్తని వైనం
దేశమంతటా పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం మరింత వేడెక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ..ఆయా రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలన్నీ సంక్షేమ పథకాల జపం చేస్తున్నాయి. ప్రతి ఏటా ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన డబ్బులన్నీ ఈ పథకాల అమలుకే ఖర్చయి పోతున్నాయి. కోట్లాది మంది వీటి మీదే ఆధారపడి బతుకుతున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా నేటికీ అత్యధిక శాతం ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల కోసం వేచి చూస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన నిరాటంకంగా కొనసాగుతోంది. ఆర్థిక భద్రత లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం వచ్చినా తట్టుకునే శక్తి రాను రాను నశిస్తోంది.
పాలకులు నేరాలకు పాల్పడుతూ..నేరస్తులను ప్రోత్సహిస్తూ..మాఫియాలకు వత్తాసు పలుకుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. చట్టాలు రూపొందించడంలో కీలక భూమిక పోషించాల్సిన ప్రజా ప్రతినిధులు తమ ఆస్తులను ఎలా పెంచుకోవాలో దృష్టి సారిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోవడం మానేశారు. జనాన్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. ఎన్నికల వేళ డబ్బులు పంపిణీ చేయడం, ప్రలోభాలకు గురి చేస్తే తిరిగి అధికారంలోకి వస్తామని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. రాజ్యాంగం సాక్షిగా పాలన కొనసాగించాలి. అత్యున్నతమైన అధికారిక వ్యవస్థ ఇందు కోసం సేవలందించాలి. శాసన వ్యవస్థ..న్యాయ వ్యవస్థ రెండూ దేశానికి కళ్లు. ఇవ్వన్నీ ఇప్పుడు నామ్ కే వాస్తేగా తయారయ్యాయి.
ఇన్నేళ్ల కాలంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పరిపాలన సాగిస్తే..జనతా పార్టీ, బీజేపీ, యుపీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు పటిష్టం కావాలి. సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు ప్రజలకు అండగా ..భరోసా కల్పించేలా ఉండాలి. కానీ బాధ్యతలను విస్మరించి సర్కార్ ఇచ్చే తాయిలాల కోసమే ఆధారపడేలా ఉండకూడదు. సుస్థిరమై పాలన అందిస్తామని ప్రతి పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. భారీ ఎత్తున మేనిఫెస్టోలను విడుదల చేశాయి. కానీ ఆచరణలోకి వచ్చే సరికల్లా అవి పేదలకు చేరకుండా పోతున్నాయి. మధ్య దళారీల వ్యవస్థ, అవినీతి, అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. జవాబుదారీ తనం అసలే లేదు. ఆర్థిక నేరగాళ్లు, ఆత్మహత్యలు, మానభంగాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, మోసాలు, కుట్రలు, దాడులు, దోపిడీలు, హత్యలు, లూటీలు, ఉగ్ర మూకల విధ్వంసం, కుల, మతాల పేరుతో చంపుకోవడాలు, ఎన్ కౌంటర్లు ఇలా చెప్పుకుంటూ సమున్నత భారతం ఇపుడు నగ్నంగా నడి వీధిలో నిలబడింది.
వాస్తవ ఆధీన రేఖ వెంట ఎప్పుడూ యుద్ధ ఛాయలే ..వేలాది మంది భారతీయ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రాజకీయ నాయకుల కుట్రలకు బలవుతున్నారు. నేటికీ స్పష్టమైన ప్రణాళిక అంటూ లేకుండా పోయింది. అపారమైన వనరులు, నీటి సంపద కలిగిన ఈ దేశంలో నేటికీ 50 శాతానికి పైగా ఇంకా ఉపాధి కోసం వేచి చూస్తున్నారు. ప్రాజెక్టులను ఆధునీకరించాలి. కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు చేపట్టాలి. నదులను అనుసంధానం చేయాలి. రహదారులను అభివృద్ధి పరచాలి. పరిశ్రమలు విరివిగా ప్రారంభించాలి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చదివిస్తే మన విద్యార్థులు ఇతర దేశాలకు వెళుతున్నారు. మన మేధస్సు వారికి ఉపయోగపడుతోంది. దీని వల్ల ఎంతో ఆదాయాన్ని మన దేశం కోల్పోతోంది. ఈ దేశంలో జన్మించిన మనం దేశ ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ ఉండక పోవడంపై పునరాలోచించాలి. తరాలు మారినా మన సంస్కృతి మారలేదు.
విలువలకు కట్టుబడిన కోట్లాది జనం నేటికీ ప్రభుత్వ రంగాలనే నమ్ముకున్నారు. బడా బాబులు మోసానికి పాల్పడుతుంటే పేదలు మాత్రం ఇంకా తమ పనులను తామే చేసుకుంటున్నారు. దేశం యావత్తు రైతులకు రుణపడి ఉన్నది. ఇన్నేళ్లయినా ఇంకా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడడం సిగ్గు చేటు. రైతులకు నెలా నెలా పెన్షన్లు ఇచ్చేలా పాలకులు ఆలోచించాలి. ఎన్నికల వేల ఓట్ల కోసం డబ్బులు ఖాతాలో జమ చేయడం కాదు..వారికి బతికేందుకు కావాల్సిన భరోసా ఇవ్వాలి. పండించిన పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలి. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌లు లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మ బలికారు. కానీ వీరు వేలు కూడా భర్తీ చేయలేక పోయారు.
ఈసారి ఎన్నికల్లో ఉద్యోగాల ఊసే ఎత్తక పోవడంపై నిరుద్యోగులు, అభ్యర్థులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు సంక్షేమ పథకాలను రూపొందించడం మానేసి..కనీసం ప్రజలకు సేవలందించేందుకు కావాల్సిన ఖాళీలను భర్తీ చేస్తే కొంతలో కొంతైనా న్యాయం చేసిన వాళ్లవుతారు. యువత శక్తి నిర్వీర్యమవుతోంది. వారు నిరాశకు లోనవుతే సమాజానికి మంచిది కాదు. అసాంఘిక శక్తుల వైపు మళ్లే అవకాశం పొంచి ఉన్నది. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్రాలు కొలువులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి. లేక పోతే ప్రభుత్వాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. తస్మాత్ జాగ్రత్త...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి