గురువు గారూ..గురుభ్యోనమః ..!
కండ్లకుంట్ల శ్రీనివాసాచార్యులు అంటే ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ కె.శ్రీనివాస్ అంటే తెలంగాణలో ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. అపారమైన విజ్ఞానం, అంతులేని మేధోతనం, అద్భుతమైన రచనా విన్యాసం, వ్యక్తిత్వంలోను ..ఉపన్యాసం ఇవ్వడంలోను…ఏ విషయంపైన నైనా సులువుగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. సాహితీ పిపాసకుడిగా, పాఠకుడిగా, అధ్యయనశీలిగా, సంపాదకుడిగా, విశ్లేషకుడిగా, విమర్శకుడిగా, ఇలా ప్రతి ఫార్మాట్‌లో కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడటమే కాక..సూటిగా ..తూటాలు గుండెల్ని చీల్చినట్లు ఆయన అక్షరాలు మనల్ని కదిలింప చేస్తాయి. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేస్తాయి. అంతేనా పడుకున్నా సరే వెంటాడుతాయి. మనం ఎక్కడున్నామో..గుర్తు చేస్తాయి. మనుషుల పట్ల..సమస్త ప్రపంచం పట్ల..సమాజం పోకడ, జీవిత ప్రయాణం, కాలపు ప్రవాహన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో అలవోకగా ..అంటుకట్టినట్టు మనకందిస్తారు ఆయన. సరిగ్గా గురువు గారితో అనుబంధం ఆబిడ్స్ లో మొదలైంది. ఇపుడున్నంత అవకాశాలు, చదువుకునే వీలు, పనిచేసే మార్గాలు లేవు. బిక్కుబిక్కుమంటూ వార్త దినపత్రికలో చేరాక తెలిసింది..కె.శ్రీనివాస్ అంటే.
అంతకు ముందు కేఎస్ రాసినవన్నీ ఆత్రంగా చదవడం అలవాటు. గురువు గారి దగ్గరకు వెళ్లా..నవ్వారంతే..అందరూ ఎవరికి వారే..మెల మెల్లగా సాంబశివరావుతో పరిచయం. అప్పటికే సాహిత్యంతో పరిచయం ఉండడం, కవిత్వంతో చెలిమి చేయడం వల్ల ..కొద్దో గొప్పో ఆఫ్రికన్, రష్యన్ రచనల్ని పట్టుపట్టి చదవడం కావచ్చు..మరింత కేఎస్ పట్ల అభిమానం పెరిగి పోయింది. తొలి అక్షరంతో అంతరిక్ష ప్రయోగం ట్యాగ్ లైన్ తో వచ్చిన ఆ పత్రిక తెలుగు వాకిట ఓ సంచలనం. తెలుగు ప్రచురణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన సందర్భం అది. ఆనాడు వార్తలో మొదలైన అనుబంధం గురువు గారితో అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆఫీసు పైన..కింద వేడి వేడి ఛాయ్. ఆకలిని తీర్చే సమోసాలు. వార్తతో మొదలైన ప్రయాణం తల్చుకుంటే ఇప్పటికీ 24 ఏళ్లు గడిచి పోయాయి. గురువు గారిని ఇటీవలే ఓ పని మీద వెళ్లి కలిశా. ఆ మధ్య పాలమూరుకు వచ్చారాయన. పట్టుపట్టి సీతారం, కేఎస్‌లను ఇంటికి తీసుకెళ్లా. కాదనలేక వచ్చేశారు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో..ఇప్పటికీ అలాగే ఉన్నారు. అదే నవ్వు..చేతిలో సిగరెట్.
చేగువేరాను చదివినప్పుడు..ఎల్టీటీటీఇ ప్రభాకరన్‌ను చూసినప్పుడు..బాబ్ మార్లేలోని మార్దవాన్ని గుర్తు చేసుకున్నప్పుడు..జమీల్యా ప్రేమకథలో లీనమైనప్పుడు..గోర్కీ అమ్మలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు..చంఘీజ్ ఖాన్‌ను ఆవాహన చేసుకున్నప్పుడు..మట్టిని, మనుషుల్ని , అడవితో పాటు మైదానాల వెంట నడిచినప్పుడు..మెరీనా బీచ్ వద్ద నిరీక్షించినప్పుడు..కలిగిన ఆలోచనల పరంపరకు ఓ రకంగా గురువు .కండ్లకుంట్ల శ్రీనివాసాచార్యులు గారు ఇచ్చిన క్లాసులు కొత్త రకంగా ఆలోచించేలా చేశాయి. ప్రముఖ కవి హిమజ్వాలతో సాహితీ క్షేత్రంలోకి అడుగు పెడితే..
అద్భుతమైన ప్రతిభా పాటవాలను స్వంతం చేసుకుని తమదైన ముద్రతో కొన్నేళ్లుగా తెలుగు ప్రచురణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన గొప్పనైన వ్యక్తులు..గురు సమానులైన ఏబీకే ప్రసాద్, సతీష్ చందర్, నాంచారయ్య, వేణుగోపాల్, మురళి, లక్ష్మణ్ రావుల వార్తా పాఠాలు, బోధనలు ఇప్పటికీ చెవుల్లో మార్మోమోగుతూనే ఉన్నాయి. హెడ్డింగ్స్‌లోను..వార్తల సరళిలోను ప్రత్యేకత ఉండేలా చేసిన టీచర్, ఆచార్యుడు..అధ్యాపకుడు కేఎస్. ఇంతకంటే ..ఏం చెప్పగలను..ఆనాటి జ్ఞాపకాలు ఇంకా సిగరెట్ పీల్చాక విడిచే పొగల్లా కదలాడుతూ వుంటే..కభీ కభీ మేరే దిల్ మే..ఖయాల్ ఆథా హై ..అంటూ పాడుకోవడమే తప్ప…గురువు అంటే ఆయన ఒప్పుకోరు..కానీ ఆయనంటే నాకు అభిమానం. అందుకే గురుభ్యోనమః..మీరిలాగే రాస్తూనే ఉండాలి. గుండెలు మండేలా..ప్రేమ కురిపించేలా..కన్నీళ్లు తాకేలా..కేఎస్ గారూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి