టెలికం కంపెనీలకు షాక్
భారత సర్వోన్నత న్యాయస్థానం టెలికాం కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. స్థూల రాబడి సర్దుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిందిగా కోరుతూ టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్లలో పసలేదని తేల్చి వాటిని కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై భారతీ ఎయిర్‌టెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. టెలికం కంపెనీలు ప్రభుత్వానికి1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
లైసెన్స్ ఫీజు , స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలుల కింద టెలికం కంపెనీలు దాదాపు 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని గతేడాది టెలికం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. టెలికం కంపెనీలు జూలై 2019 నాటికి లైసెన్స్ ఫీజు కింద 92,642 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఎస్‌యూసీ కింద అక్టోబరు 2019 నాటికి 55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు వీటిలో మెజారిటీ వాటాను చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయిర్‌టెల్ మొత్తం 35,586 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అందులో ఎల్‌ఎఫ్ కింద 21,682 కోట్లు, ఎస్‌యూసీ కింద 13,904 కోట్లు చెల్లించాల్సి ఉంది. వొడాఫోన్ ఐడియా మొత్తం 53,038 కోట్ల బకాయిలు పడగా, అందులో ఎల్‌ఎఫ్ కింద 28,309 కోట్లు, ఎస్‌యూసీ కింద 24,730 కోట్లు చెల్లించాల్సి ఉంది.
గత బకాయిల్లో 92,000 కోట్లు చెల్లించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ సహా ఇతర టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో జరిమానాలు, వడ్డీ ఉన్నాయి. టెలికం కంపెనీలు బకాయిలను చెల్లించాల్సిందేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో మరో వ్యాజ్యానికి తావు లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, నిర్దిష్ట కాల పరిమితిలోగా బకాయిలను చెల్లించాలంటూ వేర్వేరు ఆదేశాలు చేసింది. దీంతో దిగ్గజ కంపెనీలు లబోదిబోమంటున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి