పాక్ కు మళ్ళీ భంగపాటు

మరోసారి పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నం చేసింది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్‌ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలి పోయింది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక మైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్‌ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదే పదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు.

పాక్‌ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు అని ఆయన వివరించారు. దురుద్దేశ పూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ కశ్మీర్‌పై సమావేశం జరిగింది. భారత, పాక్‌ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతా మండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక భేటీకి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ సహా పలువురు నేతలకు భారత్‌ ఆహ్వానం పంపనుంది.

ఎస్‌సీవోలోని పాకిస్తాన్‌ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్‌’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్యక్రమంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావెద్‌ జరీఫ్‌ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్‌ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ మంత్రి జరీఫ్‌ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

కామెంట్‌లు