ఆర్ధిక రంగం ప్రమాదకరం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన బీజేపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ నీటి మూటలేనని తేలి పోయింది. ఇప్పటికే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతోంది, దీనికి వెంటనే కాయకల్ప చికిత్స అవసరమని ఆర్థికరంగ నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్లు సుబ్బారావు, రంగ రాజన్ లు హెచ్చరించారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే దివాళా తీసే ప్రమాదం పొంచి ఉందంటూ ముందస్తు జాగ్రత్తలు సూచించారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పట్టించు కోలేదు. వీరిని ఆయన నమ్మలేదు. ఏకంగా నోట్లను రద్దు చేశారు. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయ పడింది.
దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్‌గాడో వెల్లడించారు. అయితే ఇండియా ఇటీవల ఆర్ధిక రంగంలో కొంత ముందడుగు వేసింది. లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారు. 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధాన పరమైన చర్యలు తీసుకోక పోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరమున్నది. ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడి పోయింది.
దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో రుణ వృద్ధి లేక పోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడి పోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై ప్రభావం చూపుతోంది. తగినంత వ్యాపార విశ్వాసం లేక పోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. వస్తు, సేవల పన్ను మంచిదే అయినప్పటికీ ఇంకా ఆచరణలో వెనుకబడి ఉన్నది. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి.
అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకు రావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్‌లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరమని సూచించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి