ప్రక్షాళనతోనే పరిష్కారం
నిన్నటి దాకా ఆందోళనలతో అట్టుడికిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో మునిగి పోయింది. ఎలాగైనా సరే ఆర్టీసీని ఆదాయ బాటలు నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో సీఎం ఎప్పటికప్పుడు ఆర్టీసీపై సమీక్షలు చేస్తున్నారు. మంత్రి, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గండం నుంచి గట్టెక్కించాలని, ఇందు కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగారు. అంతే కాకుండా ఆర్టీసీ కార్గో సర్వీసెస్ రంగం లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. తాజాగా టీఎస్‌ఆర్టీసీలో ప్రక్షాళన చేయడం మొదలైంది.
ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేతనానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటి వరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా, మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ్బందికి సరైన పనే లేదు. కొన్ని చోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఇప్పుడు 800 బస్సులను తగ్గించడం, కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తుండటం, త్వరలో 1,334 అద్దె బస్సులు కొత్తగా ఆర్టీసీలోకి వస్తుండటం, వెరసి మొత్తం సంస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. డిపో స్థాయిలో సిబ్బందిని సర్దుబాటు చేయడంతో ప్రారంభించి అనంతరం ఆర్టీసీలో అనుబంధంగా ఉన్న విభాగాల్లో అవసరం లేని వాటిని తొలగించనుంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోలు ఉండగా వాటిల్లో కొన్ని డిపోలకు అవసరానికి మించి ఎక్కువ బస్సులు కేటాయించారు. దీంతో అవి నష్టాల్లో ఉన్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్సులను 800కు తగ్గించాలని భావిస్తోంది. కండిషన్‌లో లేని 400 డొక్కు బస్సులను తొలగించనుంది. దీంతో డిపోల్లో సిబ్బంది అవసరం కూడా తగ్గుతుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు ఎక్కువ బస్సులు కేటాయించి తక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు తక్కువ బస్సులు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. పనిలేని సిబ్బందిని వేరే చోటకు పంపనున్నారు. మరో 15 రోజుల్లో 1,334 అద్దె బస్సులు కొత్తగా రాబోతున్నాయి. వాటి డ్రైవర్లు, మెకానిక్‌లను వాటి యజమానులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున ఆర్టీసీపై భారం తగ్గనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి