కోట్లు కురిపిస్తున్న ఏఐ


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ టాలెంట్ ఉన్నోళ్ల కోసం దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ పరంగా చూస్తే ఇండియన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంటోంది. తాజాగా ఇదే రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విభిన్నమైన కోర్సులు చేసే వారి పంట పండుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , ఎంఎల్, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిస్ట్, తదిర కోర్సులు చేసిన వారంతా కోట్లు సంపాదిస్తున్నారు. ఓ వైపు ఆర్ధిక మందగమనం ఉన్నా ఐటీ రంగం మాత్రం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పలు వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగు పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరకడం లేదు.

దీంతో చాలా సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది 1,000 దాకా ఉండగా ఈ ఏడాది 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్‌ లెర్నింగ్‌ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగు తున్నప్పటికీ..ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు 2,500 పైగా ఖాళీగా ఉన్నాయని వివరించింది. దేశీ ఏఐ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది  2,950 కోట్లకు చేరింది. 2018లో ఇది 1,600 కోట్లుగా ఉంది. దేశీయంగా ఏఐ నిపుణుల సగటు అనుభవం 7.2 సంవత్సరాలుగా ఉంటోంది.

29 శాతం మంది ఏఐ ప్రొఫెషనల్స్‌కు పదేళ్ల పైగా అనుభవం ఉంది. ఈ విభాగంలో చేరిన ఫ్రెషర్స్‌ సంఖ్య గతేడాది 3,700గా ఉండగా.. ఇది ప్రస్తుతం 60 శాతం వృద్ధి చెంది 6,000కు పెరిగింది. ఏఐ నిపుణులు ఎక్కువగా బెంగళూరును ఎంచుకుంటున్నారు. ఈ ఏడాదిలో 23,000 పైగా నమోదైంది. 8,000 ఉద్యోగాలతో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ 17,000 , ముంబై 9,000 మందితో రెండు.. మూడు స్థానాల్లో నిల్చాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ఏఐ నిపుణులకు సగటు జీతభత్యాలు 14.7 లక్షలుగా ఉంటోంది. ముంబైలో ప్రొఫెషనల్స్‌ అత్యధికంగా వార్షికంగా 17 లక్షల ప్యాకేజీ అందుకుంటుండగా, చెన్నైలో అత్యంత తక్కువగా 10.8 లక్షల స్థాయిలో ప్యాకేజీ ఉంటోంది. మొత్తం మీద ఎఇ అనుభవజ్ఞుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. 

కామెంట్‌లు