మరాఠాలో వెనక్కి తగ్గిన బీజేపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సంఖ్యా బలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనుకంజ వేసింది. ఈ మేరకు బీజేపీ శాసన సభా పక్ష నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్‌ను కలిసి ఈ విషయం తెలియ జేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్ గడవు విధించారు. దీనిపై ఫడ్నవిస్ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం లేదని.. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. కాగా అంతకు ముందు ఎట్టి పరిస్థితుల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడ గట్ట లేమని భావించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ కూడదని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ, శివసేనపై విమర్శల వర్షం కురిపించారు. ఠాక్రే నమ్మక ద్రోహం చేశారని మండి పడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి