దమనకాండ దారుణం..కామెంట్స్ బాధాకరం
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్స్ నిరాధారమైనవి. అత్యున్నతమైన పదవిలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. వేలాది మంది కార్మికులు కడుపులు మాడ్చుకుని, స్వచ్చందంగా నిర్బంధాలను దాటుకుని తరలి వచ్చారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సీపీకి తగదని హితవు పలికారు ఆర్టీసీ జెఎసి నేత అశ్వత్థామ రెడ్డి. నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్ బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ మావోయిస్టలు ఉన్నా రంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం.
పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె సక్సెస్ అయ్యే వరకూ మహిళా సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పోలీసుల దమన కాండను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో బస్సు డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కాగా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు, పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారని సీపీ అంజనీకుమార్ చెప్పారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి