మన ప్లేయర్స్ అదుర్స్
వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు మహిళలు..అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్‌కు 143 పరుగులు సాధించారు. షెఫాలీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, స్మృతి మంధాన 46 బంతుల్లో 11 ఫోర్లతో 67 పరుగులు చేసి విండీస్ బౌలర్ల భరతం పట్టారు.
విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో విశేషంగా రాణించి, సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంధాన, టీ20 మ్యాచ్‌లో కూడా బౌండరీల మోత మోగించారు. మరొక వైపు షెఫాలీ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడికి జతగా చివర్లో హర్మన్‌ప్రీత్ 21 పరుగులతో వేదా కృష్ణమూర్తి15 పరుగులతో క్రీజులు నిలిచారు. మన ప్లేయర్స్ ధాటిగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కాగా, మంధాన, షెఫాలీలు 143 పరుగుల భాగ స్వామ్యం రికార్డు క్రియేట్ చేసింది. మహిళల టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం.
ఈ క్రమంలోనే 2013లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్‌లో నమోదైన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును వీళ్ళిద్దరూ బ్రేక్ చేశారు. ఆపై 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళలు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులే చేశారు. వికెట్ కీపర్ షీమైన్ క్యాంపబెల్ 33 మినహా ఎవరూ రాణించ లేదు. భారత బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ లకు చెరో వికెట్ లభించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి