నిరాశ పరిచిన తెలంగాణ వార్షిక బడ్జెట్ - ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ - ఆర్ధిక మాంద్యం..బీజేపీ సర్కార్ పాపమే
ఎంతో ఉత్కంఠకు గురి చేసిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దేశంలో ఆర్ధిక సంక్షోభం కొనసాగుతూ ఉన్నదని, దాని ప్రభావం మన రాష్ట్రంపై పడిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2019 -2020 సంవత్సరానికి గాను ముఖ్యమంత్రి శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గిన కారణంగా కేటాయింపులలో మార్పులు చేయడం జరిగిందన్నారు. ఎప్పటి లాగే పెన్షన్స్, రైతు బంధు పథకం, ప్రాజెక్టులు చేపడతామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం బాగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. విద్య, వైద్యం , తదితర రంగాలను కొనసాగిస్తామన్నారు. ఆటోమొబైల్, తదితర రంగాలు మూసి వేసే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. 24 వేల కోట్ల నిధుల లోటు ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిపాదిత ఖర్చు కింద 1,46,492 రూపాయల కోట్లు గా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల కోట్లు , మూల ధనం విషయానికి వస్తే 17 వేల 274 కోట్లు గా పేర్కొన్నారు. ఇక మిగులు బడ్జెట్ అంచనా కింద 2 వేల 44 కోట్లు ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆర్థికంగా లోటు 24 వేల కోట్లు దాటిందన్నారు. ఓటాన్ బడ్జెట్ ప్రతిపాదనలు లక్షా 82 వేల కోట్లుగా ఉండగా , ప్రస్తుతం వార్షిక బడ్జెట్ మాత్రం కొంచం తగ్గించి చూపించారు సీఎం.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశ పెట్టిన ఆసరా పెన్షన్స్ కోసం 9 వేల 402 కోట్లు కేటాయించారు.
గ్రామాల బలోపేతం కోసం 2 వేల 714 కోట్లు , రాబోయే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు 1764 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటల పాటు ఉచితంగా రైతులకు కరెంట్ ఇస్తున్నామని, విద్యుత్ సబ్సీడీలకు 8 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. రైతు రుణాల మాఫీ చేసేందుకు గాను 6 వేల కోట్లు, రైతు బందుకు 12 వేల కోట్లు అదనంగా కేటాయించామని కేసీఆర్ చెప్పారు. భీమా కోసం 1250 కోట్లు కేటాయించామన్నారు. అయితే ప్రాధాన్యతా రంగాలు ఇంకా ఉన్నాయి. వాటి విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాల భర్తీ విషయం గురించి వెల్లడించలేదు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా ప్రజా సంక్షేమం కోసం నిధులు కేటాయించామని చెప్పారు సీఎం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి