అంపశయ్యపై బీఎస్ఎన్ఎల్..ఉద్యోగులకు ఉద్వాసన..?

భారతదేశంలో అతిపెద్ద వాటా కలిగి, ఎన్నో ఏళ్లుగా విశిష్టమైన సేవలు అందించిన  భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌  ఇప్పుడు మోడీ దెబ్బకు విలవిలా లాడి పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంస్థ అంపశయ్యపై ఉన్నది. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఇప్పటికే మోయలేని భారంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్వాకం, మిగతా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడ లేక పోవడం ప్రధాన కారణం. దేశంలో ఏ సంస్థకూ లేనంత నెట్ వర్క్ బీఎ్‌సఎన్‌ఎల్‌ కు ఉన్నది. లక్షకు పైగా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలో 50 శాతానికి పైగా ఆదాయం జీతాలకే పోతోందని ప్రభుత్వం అంటోంది. దేశ వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీంతో నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర సర్కార్ సంబంధిత శాఖా మంత్రిని ఆదేశించింది.

ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్‌ లో స్వచ్చంద పదవీ విరమణ చేసేలా ఉద్యోగులను ఇంటికి పంపిస్తే కొంత మేరకు బతికి బట్ట కడుతుందని భావిస్తోంది. ఇప్పటికే సంస్థకు ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి భారీ ఎత్తున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇది కూడా భారంగా మారింది. ఇదిలా ఉండగా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల దెబ్బకు ప్రభుత్వ సంస్థ పోటీ పడలేక చేతులెత్తేసింది. దేశమంతటా బలమైన నెట్ వర్క్ కలిగి ఉన్నా నష్టాల్లో కూరుకు పోవడం విస్తు పోయేలా చేసింది. పాలకులు మారడం, విధానాలు మారడం కూడా ఈ సంస్థ పని తీరుపై ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి పెరుగుతోంది. ఉద్దీపన చర్యలు చెప్పట్టింది. ఈ మేరకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఎ్‌సఎన్‌ఎల్‌ కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. బీఎ్‌సఎన్‌ఎల్‌కు దన్నుగా నిలవడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమన్నారు.

బీఎ్‌సఎన్‌ఎల్‌ ప్రభుత్వం నుంచి కొంత ప్యాకేజీ కోరుతోంది. బీఎ్‌సఎన్‌ఎల్‌ను ప్రోత్సాహించాలని అనుకుంటున్నాం. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనది. ఈ సంస్థ సక్రమంగా పని చేయాలనుకుంటున్నాం. అందుకే ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నాం. రానున్న కాలంలో కొన్ని ప్యాకేజీలు అందిస్తాం అని తెలిపారు. బీఎ్‌సఎన్‌ఎల్‌ అధికార వర్గాలు సమర్పించిన ప్యాకేజీ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో మంద గమనం తాత్కాలిక మేనని మేఘ్వాల్‌ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే 30 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులను తగ్గించుకోవాలని బీఎ్‌సఎన్‌ఎల్‌ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే 2,500 మంది  ఉద్యోగులను తొలగించింది. ఇక స్వచ్ఛంద పదవీ విరమణ పథకం  ద్వారా వేలాది మందిని తగ్గించు కోవాలని బీఎ్‌సఎన్‌ఎల్‌ భావిస్తోంది. వార్షికంగా రూ.1,671 కోట్ల నుంచి రూ.1,921 కోట్ల వరకు భారం తగ్గవచ్చని అంచనా. మొత్తం మీద ప్రభుత్వం ఆదుకుంటుందా లేక చేతులెత్తేస్తుందో వేచి చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!