రికార్డ్ ధరకు బాలాపూర్ లడ్డు.. శోభాయాత్ర పర్వం..భాగ్యనగరం..!
గణపతి బొప్పా మోరియా అంటూ భాగ్యనగరం శోభాయాత్రతో శోభిల్లుతోంది. ఒకటి కాదు వేలాదిగా గణనాదులు నిమజ్జనానికి తండోప తండాలుగా తరలి వస్తున్నాయి. హైదరాబాద్ నగర పాలక సంస్థ, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించారు. మొత్తం 40 చోట్ల వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రతి చోటా సీసీ కెమెరాలు బిగించారు. ఏ ఒక్క చిన్న సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీస్ కంట్రోల్ రూము కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మోనిటరింగ్ చేస్తారు. హైదరాబాద్ మరోసారి సాగర హారాన్ని తలపింప చేస్తోంది. ఎక్కడ చూసినా గణనాదులు, వాహనాలతో నిండి పోయింది ట్యాంక్ బండ్.
జీహెచ్ఎంసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. ఆయా ప్రాంతాలలోని ఉత్సవ కమిటీలు నీళ్లు, భోజన ఏర్పాట్లు చేశాయి. నగరమంతటా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచి పోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో రహదారులు పూర్తిగా నిండి పోయాయి. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గాను జర్మనీ నుంచి ప్రత్యేకించి క్రేన్ ను ప్రభుత్వం ఇక్కడికి తెప్పించింది. ఇంకో వైపు శోభాయాత్ర పర్వం అంగరంగ వైభవంగా సాగుతోంది. దాదాపు 50 వేలమందికి పైగా పాల్గొనే ఖైరతాబాద్ గణనాథుడును చూసేందుకు జనం క్యూ కట్టారు. నగరం లో జైబోలో గణేష్ కు అంటూ నినాదాలు మిన్నంటాయి. మరో వైపు హైద్రాబాద్ కే తలమానికంగా నిలుస్తూ వస్తున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పెద్ద ఎత్తున సాగింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఈ లడ్డూను దక్కించుకునేందుకు తరలి వచ్చారు.
ఈసారి 20 మంది లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. అంతకు ముందు విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వేలం పాటను ప్రారంభించారు. పెద్ద ఎత్తున భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురి చేసిన బాలాపూర్ లడ్డును బాలాపూర్ కు చెందిన కొలను రామ్ రెడ్డి 17 లక్షల 60 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ఇదే కుటుంబానికి చెందిన కొలను మోహన్ రెడ్డి 1994 లో మొదటి సారిగా 450 రూపాయలకు దక్కించుకున్నారు. దక్కించుకున్న లడ్డుకు తమ ఇంట్లో వీరు పూజలు జరిపించారు. ఆ తర్వాత అదే ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. మిగతా లడ్డునూ తమ పొలాల్లో చల్లుతామని రామ్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద బాలాపూర్ లడ్డూతో ఆయన హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారారు. ఎంతైనా ఇదంతా వినాయకుడి మహిమే అంటున్నారు కొలను కుటుంబీకులు. అవును కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి