ఏపీ సరే..తెలంగాణ ఆర్టీసీ మాటేమిటి..?

వాళ్ళు సంస్థలో దినసరి కూలీలకంటే ఎక్కువగా పని చేస్తున్నారు. ఇంకొందరు పని భారం ఎక్కువై తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీతాలు లేకుండా పస్తులున్నారు. అష్ట కష్టాలు పడ్డారు. కొత్త రాష్ట్రంలో తమ బతుకులు బాగు పడతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సమ్మె నోటీసులు సంస్థకు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు లాభాల బాటలో పయనించిన ఈ సంస్థ ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరుకుంది.

సంస్థను గట్టెక్కించేందుకు పలు చర్యలు చేపట్టాలని సంస్థ ఎండీని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వమే ఆర్టీసీకి సాయం చేయలని నిర్ణయం తీసుకున్నారు. అయినా ఆరీసి గట్టెక్కాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. ఆర్టీసీకి బాకీ పడిన సంస్థలు తిరిగి ఇచ్చేలా చూడాలని, ప్రభుత్వం చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని, కొత్తగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఆర్టీసీకి పన్నునుంచి మినహాయించాలని కార్మికులు, సంఘాల నేతలు కోరారు. అయితే గత ఉమ్మడి రాష్ట్రలో ఆర్టీసీని పాలకులు పట్టించు కోలేదు. భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. లెక్కకు మించి ప్రైవేట్ వాహనాలకు జెండా ఊపారు.

అంతా రిటైర్డ్ ఉద్యోగులే కీలక స్థానాల్లో తిష్ట వేసుకుని ఉండడం ఆర్టీసీ ఉద్యోగులకు శాపంగా మారింది. ఆయా పార్టీలకు చెందిన వారి బస్సులే ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లను నియంత్రించకుండా ఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై కార్మికులు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పిన సీఎం తాజాగా సంస్థను కార్మికులే రక్షించు కోవాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారంటూ బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆరోపించారు.

పక్క రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేస్తే ఇక్కడ ఎందుకు చేయడం వీలు కాదంటూ ప్రశ్నించారు.భారం పెరుగుతుంటే విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆరేళ్లయినా ఆర్టీసీకి ఈరోజు దాకా పూర్తి కాలం పాలక వర్గాన్ని, ఎండీని నియమించక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో టీఎస్ఆర్టీసీకి రూ.240 కోట్ల అప్పు మాత్రమే ఉందన్నారు. ఐదేళ్లలో ఆ నష్టం రూ.3,380 కోట్లకు చేరుకోవడం సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమన్నారు.

ఓ వైపు ప్రైవేటు సంస్థలు లాభాలు గడిస్తుంటే..10 వేల బస్సులున్న ఆర్టీసీకి 2018-19లోనే రూ.928 కోట్ల నష్టం రావడమేంటని ప్రశ్నించా రు. కార్మికుల సంక్షేమ నిధులు రూ.1200 కోట్లను కూడా సంస్థకు వాడుకోవడంతో ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు నెలలు గడిచినా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ అందడం లేదని వాపోయారు. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వమే రూ.వెయ్యి కోట్ల బకాయి పడిందని, అది చెల్లించకపోతే సంస్థ ఎలా గట్టెక్కుతుందని నిలదీశారు. ఆర్టీసీ నుంచి 27శాతం వ్యాట్‌ వసూలు చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మొత్తం మీద ఏపీలో ఆర్టీసీ విలీనం తెలంగాణాలో దుమారం రేపేలా ఉన్నది.

కామెంట్‌లు