డాటర్ ఆఫ్ ది నేషన్ - గాత్ర సామ్రాజ్ఞికి అరుదైన గౌరవం..!

కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వం గాన కోకిల లతా మంగేష్కర్ కు అరుదైన గౌరవం ప్రకటించింది. ఆమెను డాటర్ ఆఫ్ ది నేషన్ గా వెల్లడించింది. ప్రధానమంత్రికి లతా మంగేష్కర్ అంటే ఎనలేని గౌరవం. దీంతో ఆమెను  సిసలైన భారత జాతి ముద్దు బిడ్డగా పరిగణించాల్సి ఉంటుంది. వచ్చే 28 తో ఆమెకు 90 ఏళ్ళు నిండుతాయి. ఇంత వయసు వచ్చినా ఆమె గొంతులో మాధుర్యం అలాగే ఉన్నది. గాయకురాలు, నటి కూడా. 1942 లో కళా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 980 సినిమాలు. 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. ఆమె తండ్రి సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ , చెల్లెలు ఆశా భోస్లే ఆమె కూడా ఇండియాలో పేరొందిన గాయని.

లతాజి బాల్యం కష్టాలు, కన్నీళ్ళతో గడిచి పోయింది. ఐదో  ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు  వినడం, పాడడం తప్ప మరో లోకం లేదు. తాను చదువు కోలేక పోయినా తన తర్వాతి వారైనా పెద్ద చదువులు చదవాలనుకొంది, చదువుకన్నా సంగీతం పైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబ మంతా సంగీతంలోనే స్థిరపడి పోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా సైగల్ ను తెలిపింది. తండ్రి 1942లో మరణించాడు. పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది.  సినీ రంగంలోకి ప్రవేశించి, మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సూరయ్యలు  గాయకులుగా  ఉన్నారు. సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు.

సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ,  బప్పీలహరి, రాంలక్ష్మణ్,  ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. ఓ.పి.నయ్యర్ మాత్రం లత పాట తన సంగీతానికి పనికి రాదని ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళాడు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ  ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూత లూగిస్తుంది, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళావేళ్ళా పడతారని ముఖర్జీతో అన్నారట.

మహల్ సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు. హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె. 1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజా రే పరదేశీ పాటకు ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరీ సంగీత దర్శకత్వం వహించారు. మొఘల్-ఎ-అజమ్  సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట బిగ్ హిట్. 1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే అంటూ పాడితే కన్నీళ్లు పెట్టుకున్నారు.

1963లో మంగేష్కర్ ఎస్.డి.బర్మన్ సంగీత సారథ్యంలో మళ్ళీ పాడటం మొదలు పెట్టారు. ఆయన కుమారుడు ఆర్.డి.బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్ లో పాడారు లత.  ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గైడ్  సినిమాలోని పాటలు హిట్ గా నిలిచాయి.. లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్ లతో భాగస్వామ్యం  35 ఏళ్ళు  కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు .1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగో నే వంటి హిట్ పాటలు పాడారు లత. బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు .ఈ పాటను ఆర్.డి.బర్మన్ స్వర పరచగా గుల్జార్ రాశారు. 1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా.

1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం అతిపెద్ద హిట్ గా నిలిచింది.1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు.   హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్ లో ఆమె పాడిన దిల్ హూం హూం కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడు పోయిన పాటగా రికార్డు సృష్టించింది. మైనే ప్యార్ కియా, ఏక్ దూజే కే లియే, సిల్ సిలా,ప్రేమ్ రోగీ, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగా  మైలీ , హీరో నగీనా , చాందినీ, రామ్ లఖన్ వంటి  సినిమాలలో పాటలు పాడారామె. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఏడాది పడుతుంది. గాయనిగా, సంగీత దర్శకురాలిగా , నిర్మాతగా లతాజీ ఎక్కని మెట్లులేవు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. తాజాగా మోదీజీ ఈ రకంగా తన రుణం తీర్చుకున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!