అభాగ్యనగరం..అతలాకుతలం..!

విశ్వ నగరంగా, ఐటీ హబ్ గా, సైబరాబాద్ గా ఎంతో పేరున్న హైదరాబాద్ ఉరఫ్ భాగ్యనగరం ఇప్పుడు దిక్కులేనిదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఈ నగరం పూర్తిగా అతలాకుతలమైంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడ చూసినా నీళ్ళే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం నగరవాసుల పాలిట శాపంగా మారింది. ఇక మెట్రో రైళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పెచ్చులు ఊడి పడిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఇటీవలే పెచ్చులు ఊడిపడి మౌనిక అనే వివాహిత చని పోయింది. మెట్రో రైల్ గురించి గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ పై కఠిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి.

20 లక్షలు సాయం ప్రకటించినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాని పరిస్థితి. నాణ్యతను పరిశీలించే అధికారులు ఎలా క్లియరెన్స్ సెర్టిఫికెట్ ఇచ్చారో వారికే తెలియాలి. హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఇప్పుడు వర్షాలు పెను సవాల్ గా మారాయి. చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడై పోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి వర్షాలు భారీ నగరాన్ని బెంబేలెత్తిస్తోంది. వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంటే మరో వైపు పాదచారులు నడిచేందుకు వీలు లేని పరిస్థితి నెలకొన్నది. నాలాలు బార్లా తెరుచుకుని ఉండడంతో ఎవరు ఎప్పుడు అందులో పడిపోతారో తెలియడం లేదు. ఐటీ సెక్టార్ కు భారీ డిమాండ్ ఉండడంతో ఉద్యోగులంతా హైదరాబాద్ లో కొలువు తీరారు. వీరికి అనుగుణంగా గత ఐదేళ్ళలో జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అంతే కాకుండా ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకేలా అనిపించేలా అపార్ట్ మెంట్స్ కొలువు తీరాయి.

ఒకప్పుడు 30 లక్షలు పలికిన ఈ అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంట్స్ ఇప్పుడు 80 లక్షల నుండి 2 కోట్లు పలుకుతున్నాయి. పేదలు, సామాన్యులకు స్వర్గధామంగా పేరు పొందిన 400 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరాక పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాగా మార్చేసింది. ఒక్క ఈ నగరమే కాకుండా తెలంగాణ రాష్ట్రమంతటా రియల్ దందా కొనసాగుతోంది. ఇక విద్య, వైద్యం పడకేసింది. ఎక్కడ చూసినా హాస్పిటల్స్, మందుల దుకాణాలు జలగల్లా జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. పాతబస్తీ గురించి ఇంక చెప్పాల్సిన పని లేదు. మెట్రో కోసం అంటూ అందమైన ఈ నగరాన్ని రూపు  రేఖలు పూర్తిగా మార్చేశారు. కుండపోతగా కురుస్తున్న వర్షాల దెబ్బకు నగరవాసులు విలవిలలాడి పోతున్నారు. ఎప్పుడు ఏ తీగలు ఎవరి మీద పడిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఇక ఈ హైదరాబాద్ నగరాన్ని ఆ దేవుడు మాత్రమే కాపాడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!