దార్శనికుడు..తెలంగాణ యోధుడు..బాపూజీ వర్ధిల్లు

ప్రపంచానికే పాఠం నేర్పిన తెలంగాణ మాగాణంలో ఎందరో వీరులున్నారు. మహోన్నతమైన మానవులను, మార్గదర్శకులను కన్నది తెలంగాణ తల్లి. పోరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, ఆత్మతగాలకు నిలువెత్తు రూపం ఈ ప్రాంతం. ఉద్విగ్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కరడు గట్టిన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అన్ని రంగాల్లో దోపిడీకి లోనైన ఈ ప్రాంతపు విముక్తి కోసం జరిగిన ప్రతి సందర్భంలోను కొండా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల్లో బాపూజీ కీలకంగా వ్యవహరించారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పుట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో నిలుచున్నారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసు వేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి గెలిచారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. నిఖార్సయిన తెలంగాణ వాదిగా పేరు తెచ్చుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారు. తాను అసలైన, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడినని నిరూపించుకున్నారు. 1969 లో జరిగిన తెలంగాణ ఉద్యమంతో పాటు 2009 నుంచి 2012 వరకు జరిగిన ప్రతి ఉద్యమంలో, పోరాటంలో, ఆందోళనల్లో స్వయంగా పాల్గొన్నారు. తానే ముందుండి నడిచారు.

ఎందరికో ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారు బాపూజీ. రాష్ట్ర చేనేత సహకార రంగానికి అలుపెరుగకుండా కృషి చేశారు. హైద్రాబాద్ నడిబొడ్డున ఉన్న జలదృశ్యం ఆయనదే. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు అనుభవించారు. లాలో పట్టా పొంది 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే వారి తరఫున వాదించి కేసులను గెలిపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటే, తెలంగాణకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందోనని వాపోయారు. ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడే అసలైన ఫ్రీడమ్ వచ్చినట్లు అంటూ ప్రత్యక్ష పోరాటానికి దిగిన అరుదైన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.1947 డిసెంబరు 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణ రావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.  2012 లో బాపూజీ ఈ లోకం వీడారు. తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఉద్యాన విశ్వవిద్యాలయంకు పేరు పెట్టింది. ఓ గొప్ప దార్శనికుడిని, నిబద్దత, విలువలు కలిగిన నాయకుడిని కోల్పోయింది తెలంగాణ. 

కామెంట్‌లు